వైద్య బిల్లుల చెల్లింపునకు అనుసరించిన విధానం ఏమిటి?
- పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి
- ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) విశ్రాంత సభ్యులకు వైద్య బిల్లుల చెల్లింపు విషయంలో అనుసరిస్తున్న విధానం ఏమిటో తెలియచేయాలని హైకోర్టు మంగళవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఏటీ విశ్రాంత సభ్యులకు వైద్య బిల్లుల చెల్లింపు విషయంలో బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాయంటూ న్యాయవాది కె.శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, వైద్య బిల్లుల చెల్లింపునకు విశ్రాంత సభ్యులు అర్హులే కదా? మరెందుకు వారికి బిల్లులు చెల్లించడం లేదని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులను ప్రశ్నించింది. వారు దీనికి సమాధానం చెప్పకుండా పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యంలో అభ్యర్థన గురిం చి ప్రస్తావించారు. అయితే ధర్మాసనం అటువంటి వాటి గురించి చెప్పొదని, ఏ రాష్ట్రంలో పెన్షన్ పొందుతుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వమే వారికి వైద్య బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలిపింది. పెన్షన్ పొందుతున్న వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం, ఏపీలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం వైద్య బిల్లులు చెల్లించాల్సి ఉందని, మరి ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది.
రేపు ఇదే పరిస్థితి తమకూ రావొచ్చని, అప్పుడు తాము కూడా ఇలానే కోర్టుకు రావాల్సిందేనా? అంటూ వారిని ప్రశ్నించింది. అసలు వైద్య బిల్లుల చెల్లింపు విషయంలో అనుసరించిన విధానం ఏమిటో చెప్పాలని ఇరువురు న్యాయవాదులకు స్పష్టం చేసింది. ఇందుకు వారు గడువు కోరడంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సమస్య మనవరకూ వస్తేకానీ తెలియదం టూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.