చిన్నారి కిడ్నాప్..హత్య | Kidnapped and killed a child | Sakshi
Sakshi News home page

చిన్నారి కిడ్నాప్..హత్య

Published Fri, Nov 28 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

చిన్నారి కిడ్నాప్..హత్య

చిన్నారి కిడ్నాప్..హత్య

డబ్బు కోసం దాయాది దారుణం
 
హయత్‌నగర్/పెద్దఅంబర్‌పేట: తమ దాయాది ఆర్థిక, రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలే క అతడి కుమారుడిని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని పథకం వేశారు... బాలుడిని అపహరించారు.అయితే తమ గుట్టురట్టువుతుందని భయపడి అతిదారుణంగా పసివాడి ప్రాణం తీశారు. మృతదేహాన్ని మాయం చేసేందుకు మృతదేహానికి రాతికడిని కట్టి చెరువులో పడేశారు.  హయత్‌నగర్, ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ పాశవిక హత్య శుక్రవారం వెలుగులోకి వచ్చింది.  పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం...  బాటసింగారానికి చెందిన కొడిశెల పెంటయ్య స్థానిక పంచాయితీలో బిల్‌కలెక్టర్. రేషన్‌డీలర్‌గా వ్యవహరించడంతో పాటు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నాడు.  ఇతని భార్య మీనా పంచాయితీ వార్డు సభ్యురాలు. వీరి కొడుకు ఉదయ్‌కిరణ్ (13) పెద్దఅంబర్‌పేటలోని రాజశ్రీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఇతని కుటుంబానికి, గ్రామ మాజీ సర్పంచ్, వరుసకు వదిన  కొడిశెల రాధమ్మబాలరాజు కుటుంబానికి కొంత కాలంగా విరోధం ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో ఏర్పడిన విభేదాలు మరింత పెరిగాయి. రాధమ్మ కొడుకు కొడిశెల నవీన్ పెంటయ్య ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయాడు.

తడి కొడుకును కిడ్నాప్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు గుంజాలని నిర్ణయించుకున్నాడు. నవీన్ అదే గ్రామంలో ఉండే తనకు వరుసకు బావ భీమనపల్లి నవీన్‌కుమార్, స్నేహితుడు చెంచెల ఉపేందర్, రేపాక నర్సింహ్మలతో కలిసి ఉదయ్‌కిరణ్ కిడ్నాప్‌కు పథకం వేశాడు.  ఉదయ్ గురువారం సాయంత్రం పాఠశాలనుంచి ఇంటికి వచ్చేందుకు పెద్దఅంబర్‌పేటలో బస్సు కోసం బస్టాపులో ఉండగా..  భీమనపల్లి నవీన్‌కుమార్ ద్విచక్ర వాహనంపై వచ్చాడు. బాటసింగారం వెళ్తున్నానని చెప్పి బాలుడిని తన బైక్ ఎక్కించుకున్నాడు. ఉదయ్‌ను వనస్థలిపురం పరిసరాల్లో బైక్‌పై తిప్పాడు. చీకటి పడ్డాక మన్సూరాబాద్ పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లాడు. తాను ఇంటికి వెళ్తానని బాలుడు గోల చేయడంతో తమ గుట్టు బయటపడుతుందని భయపడి టైతో విద్యార్థి గొంతు బిగించి చంపేశాడు. మృతదే హం నీటిలో తేలకుండా ఉండేందుకు రాతికడికి మృతదేహాన్ని, స్కూల్ బ్యాగును కట్టి చెరువులో పడేశాడు.
 బయటపడిందిలా....
 
ఉదయ్ చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో

 
ఆందోళన చెందిన కుటుంబసభ్యులు స్థానికంగా వెదకడంతో పాటు స్కూల్‌కు వెళ్లి ఆరా తీశారు. ఆచూకీ తెలియకపోవడంతో రాత్రి 9 గంటలకు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే గ్రామానికి వెళ్లి విచారించారు.  ఈ క్రమంలో ఉదయ్‌ను ఓ వ్యక్తి బైక్‌పై తీసుకెళ్లడం చూశానని, మళ్లీ చూస్తే అతడిని గుర్తుపడతానని సోహెల్ అనే విద్యార్థి చెప్పాడు. బాలుడు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం బి.నవీన్‌కుమార్ కిడ్నాప్ చేసి ఉంటాడని గ్రామస్తులు అనుమానించి అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ విషయం తెలిసి బి.నవీన్‌కుమార్ పారిపోగా.. అతడిని పోలీసులు వనస్థలిపురంలో పట్టుకుని విచారించగా.. తానే ఉదయ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు వెల్లడించాడు.  నవీన్‌కుమార్‌ను పోలీసులు మన్సూరాబాద్ పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లారు. చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు.

నిందితుల అరెస్ట్....

 బాలుడిని కిడ్నాప్ చేసి అతని తండ్రి నుంచి రూ. 10 లక్షల నుంచి 15 లక్షలు వసూలు చేయాలని కొడిశెల బాలరాజు కొడుకు నవీన్‌కుమార్, భీమనపల్లి నవీన్‌కుమార్, ఉపేందర్, రేపాక నర్సింహ్మలతో కలిసి పథకం వేశాడని వనస్థలిపురం ఏసీపీ బి.భాస్కర్‌గౌడ్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు.  నిందితుడు బి.నవీన్‌కుమార్ గతంలో నకిలీ సర్టిఫికెట్లతో హోంగార్డు ఉద్యోగంలో చేరగా.. అధికారులు అతడ్ని మూడు నెలల తర్వాత తొలగించారు.
 
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు...


బాలుడి కిడ్నాప్, హత్య నేపథ్యంలో బాటసింగారంలో శుక్రవారం ఉదయం నుంచి ఉద్రిక్తత నెలకొంది. బాధితులు, సూత్రధారి (మాజీ సర్పంచ్ రాధమ్మ కొడుకు నవీన్‌కుమార్)  దాయాదులు కావడం. వారి ఇల్లు పక్కపక్కనే ఉండటంతో పోలీసులు బందోబస్తు చేపట్టారు.  నిందితులను చంపేయాలని స్థానికులు, పెంటయ్య బంధువులు వారి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు ఉదయ్‌కిరణ్ మృతదేహం గ్రామానికి తీసుకొచ్చి.. మాజీ సర్పంచ్ ఇంటి ముందు ఉంచి ఆందోళన నిర్వహించారు. కొందరు రాధమ్మ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. పోలీసులు గ్రామపెద్దల సహాయంతో ఆందోళకారులను శాంతిపజేశారు. అనంతరం రాధమ్మ కుటుంబ సభ్యులను పోలీసులు హయత్‌నగర్ ఠాణాకు తరలించారు. అనంతరం అశ్రునయనాలతో బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement