లాఫింగ్ క్రైమ్స్ 2015 | loughing crimes in 2015 | Sakshi
Sakshi News home page

లాఫింగ్ క్రైమ్స్ 2015

Published Tue, Dec 29 2015 10:12 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM

లాఫింగ్ క్రైమ్స్ 2015 - Sakshi

లాఫింగ్ క్రైమ్స్ 2015

‘‘కుక్క మనిషిని కరిస్తే విషయం... మనిషి కుక్కను కరిస్తే విశేషం’’
 రాజధాని నగరంలో హత్యలు, హత్యాయత్నాలు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, భారీ చోరీలు వంటి సంచలనాత్మక నేరాలు నమోదవుతూనే ఉంటాయి. వీటిని నిత్యం చూస్తూనే ఉంటాం కూడా. వీటితో పాటు అంతగా ప్రాచుర్యానికి నోచుకోని వెరైటీ క్రైమ్ కూడా నమోదు చేసుకోవాల్సిన పరిస్థితులు పోలీసులకు ఉత్పన్నమవుతుంటాయి. విధుల్లో భాగమనుకుంటూ ఇష్టంతో చేసినా... ఇదెక్కడి గోలరా బాబూ అనుకుంటూ కష్టంగా భావించినా ఈ తరహా కేసుల్నీ పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది చోటు చేసుకున్న వాటిలో ఈ కోవలోకి వచ్చే కేసుల్ని ఒక్కసారి పరిశీలిస్తే...

   * చెవి కొరికి జైలుకెళ్లింది ఒకరు                 * ‘కుక్కకూ’ పోస్టుమార్టం తప్పని వైనం
  *  హైటెక్ సిటీలోనూ పశువుల దొంగలు       * ‘జుట్టు కత్తిరింపు’ పైనా కేసు నమోదు

 


 చెవి కొరికి కటకటాల్లోకి...
 ఏదో విషయం, విశేషం, పుకారు వీటిలో ఏదో ఒకదాని గురించి పలురువు ‘చెవులు కొరుక్కోడం’ తెలిసిందే. కబూతర్‌ఖానా ప్రాంతంలో ఓ వ్యక్తి కోపంపట్టలేక చెవి కొరికేసి అరెస్టయ్యాడు. అశోక్‌కుమార్ అనే వ్యక్తి తన ఇంటికి ఎయిర్ పైప్‌లైన్ పనులు చేయిస్తుండగా... పక్కింట్లో ఉండే ఆదర్శ్ వద్దంటూ వాదనకు దిగాడు. ఇది చినికి చినికి గాలి వానగా మారడంతో కోపం పట్టలేకపోయిన ఆదర్శ్... అశోక్ మీదపడి చెవి కొరికేశాడు. తెగిపోయిన చెవి భాగాన్ని తెస్తే అతికిస్తామని ఆస్పత్రి వైద్యులు అశోక్‌కు చెప్పగా..  అది దొరకపోవడంతో ఉన్న చెవికే చికిత్స చేయించుకున్నాడు. హుస్సేనీఆలం పోలీసులు ‘చెవిగాడిని’ అరెస్టు చేశారు.


 
 పశువుల దొంగపైనా పీడీ యాక్ట్...
 ఘరానా దొంగలు, రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్టర్లు, మోసగాళ్లతో పాటు అప్పుడప్పుడూ మాఫియా లీడర్లపైనా పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించడం మామూలు విషయమే. ఈ మహానగర పోలీసులు పశువుల దొంగల్ని కూడా అరెస్టు చేస్తుంటారని, వారిపైనా పీడీ యాక్ట్ పెడతారని మీకు తెలుసా..? సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అదే జరిగింది. మెదక్, రంగారెడ్డి జిల్లాలతో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ పశువుల్ని చోరీ చేస్తూ పదేపదే చిక్కుతున్న మహ్మద్ సాబేర్, మహ్మద్ జుబేర్, మహ్మద్ అక్రమ్‌లపై కమిషనర్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ తరహాలో పశువుల్ని చోరీ చేసే నేరగాళ్లపై దీన్ని ప్రయోగించడం కూడా ఇదే తొలిసారి.
 


 శునక కళేబరానికీ పోస్టుమార్టం...
 హత్యలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతి... ఈ సందర్భాల్లో పోలీసులు మృతదేహానికి శవపరీక్ష (పోస్టుమార్టం)  చేయించడం మనందరికీ తెలిసిందే. గచ్చిబౌలి అధికారులు ఓ శునకం కళేబరానికీ ఈ పరీక్షలు చేయించాల్సి వచ్చింది. కొండాపూర్‌లోని విజేత సూపర్ మార్కెట్ సమీపంలో ఓ శునకం నురగలు కక్కుతూ చనిపోయింది. విషప్రయోగం వల్లే ఇలా జరిగిందని భావించి జంతు ప్రేమికుడు అజయ్ రాహుథాన్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అధికారులు మాదాపూర్‌లోని వెటర్నరీ ఆస్పత్రిలో శునక కళేబరానికి పోస్టుమార్టం చేయించారు. నమూనాలు పరీక్షించిన ఫోరెన్సిక్ ల్యాబ్ ఎలాంటి విషప్రయోగం జరగలేదని తేల్చడంతో కేసు  మూసేశారు.  విషం ఆనవాళ్లు ఉండి ఉంటే... నిందితుడి కోసం పోలీసులు వేటాడాల్సి వచ్చేది.
 
 ‘అదృష్టం మారి’  కటకటాల్లోకి...
 నగరంలో వినాయకచవితి ఉత్సవాల జరిగేప్పుడు వినాయకుడికి ప్రసాదంగా పెట్టే లడ్డూకు ఓ విశిష్టత ఉంది. విభిన్న తరహాలో ఏర్పాటు, వేలంలో భారీ రేటు పలకడం, ఉచితంగా పంపిణీ చేయడం... తదితర చర్యలతో నిర్వాహకులు వార్తల్లోకి ఎక్కుతుంటారు. అయితే పుప్పాలగూడలో ఐదుగురు యువకులు మాత్రం శుభం కోసమంటూ లడ్డూను చోరీ చేసి కటకటాల్లోకి చేరడం ద్వారా వార్తల్లో నిలిచారు. వెంకటేష్, యాదగిరి, నరేష్, ప్రకాష్‌కుమార్, సాయికృష్ణ స్నేహితులు, మండపంలోని గణేష్ లడ్డూను చోరీ చేస్తే తమ అదృష్టం మారుతుందని భావించారు. ఓ అపార్ట్‌మెంట్‌లోని మండపంలోకి ప్రవేశించి లడ్డూతో పాటు యాంప్లిఫైర్ కూడా పట్టుకుపోయారు. విషయం పోలీసుల వద్దకు చేరడంతో నిజంగానే వారి ‘అదృష్టం మారి’ కటకటాల్లోకి చేరారు.
 
 
 అవన్నీ వదిలి ఉల్లిగడ్డల్ని..
 కాదేదీ కవితకనర్హం అన్నది నాటి పెద్దల మాటైతే... కాదేదీ చోరీకి అనర్హం అన్నది నేటి ఈ చోరుడి చేత. ఉల్లిగడ్డలు బంగారంతో పోటీపడుతూ... వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో 40 కేజీల ఉల్లిగడ్డలున్న సంచిని దొంగతనం చేశాడో చోరాగ్రేశుడు. ఓ హోటల్‌లో చొరబడిన అతగాడు అందులో ఉన్న విలువైన వస్తువులన్నీ వదిలేసి ఉల్లినే ‘సొంతం’ చేసుకున్నాడు. కాటేదాన్ పారిశ్రామికవాడలోని రవి ఫుడ్ బిస్కెట్ ఫ్యాక్టరీ ప్రాంతంలో బాలప్ప అనే వ్యక్తి చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. ఉల్లి తన ధరలతో కన్నీళ్లు పెట్టిస్తున్న సందర్భంలోనే ఈ హోటల్‌లో చోరీ జరిగింది. తలుపులు పగులకొట్టి లోపలికి ప్రవేశించిన ఓ దొంగ టీవీ, ఫ్రిజ్, గ్రైండర్, మిక్సీ వంటి వాటిని ముట్టుకోలేదు. అక్కడున్న 40 కేజీల ఉల్లిగడ్డల సంచితో పాటు రూ.7 వేల నగదు తీసుకుపోయాడు. ఉదయం హోటల్ తెరిచిన బాలప్ప విషయం తెలుసుకుని స్థానికులకు చెప్పడంతో అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.
 
 
 కుక్కల కట్టడీ తప్పలేదు..
 బోనాలు, గణేష్ వంటి పండుగలు వస్తున్నాయంటే పోలీసులు రౌడీషీటర్లు, అసాంఘికశక్తులతో పాటు అనుమానితుల విషయంలో అప్రమత్తంగా ఉండటం తెలిసిందే. అయితే ఈసారి బక్రీద్ పండుగ నేపథ్యంలో దక్షిణ మండల పోలీసులు వీరితో పాటు గ్రామసింహాల (శునకాలు) పైనా కన్నేసి ఉంచారు. అనేక ప్రాంతాల్లో రోడ్లపై పడే జంతు వ్యర్థాలను కుక్కలు తింటాయి. కొన్ని శునకాలు వాటిని లాక్కువెళ్లి కొంత భాగం తిని, మిగిలింది వదిలేస్తుంటాయి. అదే సమయంలో గణేష్ ఉత్సవాలు సైతం జరుగుతుండటంతో ఇలా శునకాలు జంతు వ్యర్థాలను ఆ మండపాల వద్దకు తీసుకువెళ్లి వదిలేసే ప్రమాదం ఉందని పోలీసులు భావించారు. అదే జరిగితే శాంతిభద్రతల సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో కుక్కల్నీ కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
 
 పగబట్టి జుట్టు కత్తిరించింది...
 వ్యక్తిగత కక్షలు, పగలు, ప్రతీకారాల కోసం కిడ్నాప్‌లు, హత్యలు, హత్యాయత్నాలతో పాటు ఆస్తుల ధ్వంసం, దగ్ధం తదితరాలు చేయడం నిత్యం జరుగుతూనే ఉంటాయి. సికింద్రాబాద్‌లోని బౌద్ధనగర్‌కు చెందిన పార్వతి మాత్రం... వ్యక్తిగత కక్షల నేపథ్యంలో సినీ ఫక్కీలో దాడి చేసి శ్రీవల్లి అనే మహిళ జుట్టు కత్తిరించేసింది. పార్వతి మరో ముగ్గురు మహిళలతో కలిసి బైక్‌లపై శ్రీవల్లి ఇంటిపై దాడి చేసింది. పథకం ప్రకారం ముగ్గురు మహిళలూ ఆమె చేతులు గట్టిగా పట్టుకోగా... పార్వతి తన వెంట తెచ్చుకున్న కత్తెరతో శ్రీవల్లి జుట్టు కత్తిరించేసింది. ‘పని’ పూర్తయ్యాక అంతే వేగంగా  బైక్‌లపై ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదుతో చిలకలగూడ పోలీసులు దాడి, జుట్టు కత్తిరింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
చోరుడికి పోలీసుల ‘ట్రీట్‌మెంట్’...
 అనేక కేసుల దర్యాప్తులో పోలీసులు అనుమానితులు, నిందితుల్ని అదుపులోకి తీసుకుంటారు. నిజం చెప్పించడంతో పాటు రికవరీల కోసమూ వీరికి తమదైన శైలిలో ‘ట్రీట్‌మెంట్’ ఇస్తుంటారు. చిలకలగూడ పోలీసులకు మాత్రం ఓ చోరుడికి తమ పర్యవేక్షణలో ‘ఎనిమా ట్రీట్‌మెంట్’ ఇప్పించాల్సిన పరిస్థితి దాపురించింది. మైలార్‌గడ్డకు చెందిన ప్రమీల సీతాఫల్‌మండి రైల్వే ట్రాక్ పక్కన వాకింగ్ చేస్తుండగా వికాస్ అనే చోరుడు ఆమె మెడలోని గొలుసు స్నాచింగ్ చేశాడు. అనంతరం పోలీసులకు చిక్కిన అతగాడు ఆ గొలుసును మింగేశాడు. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు తమ పర్యవేక్షణలో ఎనిమా చికిత్స చేయించారు. ఎట్టకేలకు గొలుసు ‘బయటకు రావడం’తో ఊపిరిపీల్చుకుని నిందితుడిని జైలుకు పంపారు.
 
 రెండో‘సారీ’... చోరీ...
 పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదనే విషయం ఆ దొంగకు బాగా తలకెక్కినట్లుంది. అయితే అతడి పశ్చాత్తాపంలోనూ ఓ చిన్న మెలిక ఉంది. నేరాలు మానడానికి బదులు ఆ ఇంటి వారికి ‘లిఖితపూర్వకంగా’ క్షమాపణలు చెప్పి ఉన్నదంతా ఊడ్చుకుపోయాడు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని బీఎన్‌రెడ్డి కాలనీలో వ్యాపారి ప్రదీప్ దంపతులు ఉంటున్నారు. అక్టోబర్‌లో వీరింట్లోకి జోరబడిన దొంగ బీరువాలోని విలువైన వస్తువులు ‘సర్దేశాడు’. వెళ్తూ వెళ్తూ గోడపై ‘సారీ’ అంటూ రాసిపోయాడు. నవంబర్‌లో మళ్లీ అదే ఇంట్లో చేతివాటం చూపించిన నేరగాడు మొదటిసారి రాసిన చోటే మళ్లీ ‘సారీ’ రాసి ఉడాయించాడు. చేతి రాతను సరిచూసిన పోలీసులు రెండు చోరీలు ఒకే దొంగ పనిగా తేల్చారు.
 
 వేధింపుల కోసం ‘చోరీలు’...
 డబ్బు సంపాదించడానికో, అవసరాలు తీర్చుకోవడానికో సెల్‌ఫోన్లు చోరీ చేసే వాళ్లను తరచుగా చూస్తూనే ఉంటాం. బాలానగర్‌కు చెందిన బ్రహ్మయ్య నైజం దీనికి విరుద్ధం. భార్యపై ఉన్న కోపంతో మహిళల్ని వేధించడానికే ఇతడు సెల్‌ఫోన్లు చేరీ చేస్తూ చిక్కాడు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇతగాడు ఫిరోజ్‌గూడలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలి మహిళలపై కక్ష కట్టాడు. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ... ఇళ్లల్లో సెల్‌ఫోన్లు చోరీ చేయడం ప్రారంభించాడు. ఆ ఫోన్లలో ఉన్న మహిళల నెంబర్లకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడి వేధించేవాడు. ఇలా రెచ్చిపోతున్న ఈ బ్రహ్మయ్య ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులకు చిక్కి జైలుకెళ్లాడు.
 
 ‘లైక్స్’ కోసం యత్నించి జైల్లో ‘ల్యాండ్’...
 పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి... అంటే ఇదేనేమో. ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన ఫజల్ షేక్ జూకు వెళ్లి, జంతువులకు అతి దగ్గరగా ఫొటోలు దిగాలని ఆశపడ్డాడు. వీటిని ఫేస్‌బుక్‌లో పెట్టి ఎక్కువ లైక్స్ పొందాలని ప్రయత్నించాడు. ఇతడు అనుసరించిన పంథా బెడిసికొట్టడంతో నేరుగా జైల్లో ‘ల్యాండ్’ అయ్యాడు. ఇతగాడు జంతువులకు దగ్గర నుంచి ఫొటోలు దిగటంతో ఆగకుండా మరో అడుగు ముందుకు వేసి తాబేళ్ల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. ఓ తాబేలు పైకి ఎక్కి నిల్చుని మరీ ఫొటోలు దిగాడు. ఈ ఫొటోలతో గుర్తింపు పొందేందుకు వాటిని ఫేస్‌బుక్‌లోని అప్‌లోడ్ చేసి ‘బుక్కైపోయాడు’. ఇవి ఫేస్‌బుక్‌తో ఆగకుండా ఇతర సోషల్‌మీడియాలతో పాటు మీడియాలోనూ హల్‌చల్ చేయడంతో జూ అధికారులు బహదూర్‌పుర ఠాణా తలుపుతట్టారు. సీన్ కట్ చేస్తే ఫజల్ షేక్ జైలుకు చేరాడు.
 
 ఇదో ‘భారీ’ దొంగల ముఠా...
 కేజీల బంగారం ఎత్తుకుపోలేదు... వందల సంఖ్యలో వజ్రాలూ దోచేయలేదు... రూ.కోట్లలో నగదునూ కొల్లగొట్టలేదు... అయినప్పటికీ ఆ గ్యాంగ్‌లోని వారు మాత్రం ‘భారీ’ చోరులుగానే రికార్డులకెక్కారు. షేక్ అబ్దుల్ కరీం, మహ్మద్ ముజాహిద్ ఏకంగా క్రేన్లు వినియోగించి భూగర్భంలో వేసే కేబుళ్లను చోరీ చేస్తూ సైదాబాద్ పోలీసులకు చిక్కారు. చార్మినార్, బంజారాహిల్స్, మాదాపూర్, సైదాబాద్ ప్రాంతాల్లో డీసీఎం వ్యాన్లలో సంచరిస్తూ కనిపించిన కేబుల్ వైర్ డ్రమ్ముల్ని ఎంపిక చేసుకునే వారు. అదును చూసుకుని క్రేన్‌తో సహా వచ్చి వాటిని తస్కరించుకుపోయేవారు. సైదాబాద్ లక్మీనగర్ సబ్-స్టేషన్ పరిధిలో ఏకంగా 13 టన్నుల కేబుల్ వైర్ డ్రమ్ముల్ని ఎత్తుకుపోయారు. ఎట్టకేలకు సైదాబాద్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లారు. పోలీసులు వీరి వద్ద నుంచి చోరీ సొత్తుతో పాటు అందుకు వినియోగించిన హైడ్రాలిక్ క్రేన్‌నూ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement