కీచకుడు మధు అరెస్ట్
హైదరాబాద్: అమాయక యువతులను వేధిస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న ఎఫ్సీఐ మాజీ ఉద్యోగి, కీచకుడు మధును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధు వాడిన ఫోన్లు, ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అమ్మాయిలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగు చూసింది. ఇప్పటికి 300 మంది అమ్మాయిలను మోసం చేసిన మధు.. మరో 500 మంది అమ్మాయిలను వేధిస్తున్నట్టు సమాచారం. పోలీసులు సైకో మధును శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. హైదరాబాద్ డీసీపీ స్వాతి లక్రా కేసు వివరాలను వెల్లడించారు. అతనిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
'మధు అమ్మాయిల ఫోన్ నెంబర్లు సేకరించి వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలకు గాలం వేశాడు. మధు దగ్గర ఉన్న జాబితాలో ఐదు వేల మంది అమ్మాయిల ప్రొఫైల్స్ ఉన్నాయి. మధు వేర్వేరు పేర్లతో సిమ్ కార్డులు తీసుకున్నాడు. తండ్రి పేరును కూడా వేరుగా రాశాడు. అతని వద్ద 18 మొబైల్స్, 30 వరకు సిమ్ కార్డులు ఉన్నాయి' అని స్వాతి లక్రా చెప్పారు. ఈ కేసును విచారిస్తున్నామని చెప్పారు. మధు వల్ల మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న విషయం దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉందని తెలిపారు.