చెల్లెలిని చేరదీస్తే.. ఎంత పని చేసింది!
మల్కాజిగిరి: చదువుకుంటుంది కదా అని చెల్లెలుకు తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే.. చెల్లెలు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా బావతో ప్రేమ వ్యవహారం నడిపింది. చివరకు అక్క భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తూ ఆమె భర్తను పెళ్లి చేసుకుంది. ఈ విషయం పై అక్క పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన మల్కాజిగిరి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఎస్ఐ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మాదన్నపేట గ్రామానికి చెందిన స్రవంతి, మౌలాలి తిరుమలనగర్‌కు చెందిన చెరుకు వెంకటేష్ భార్యాభర్తలు. వెంకటేష్ ఓ రియల్ ఎస్టేట్ సంస్ధలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. స్రవంతి చెల్లెలు సాయిశ్రీ(24) కొన్ని రోజులు చదువుకోవడానికి అక్క వద్దకు వచ్చింది. చదువుకోవడంతో పాటు ఉద్యోగం చేసింది.
ఈ క్రమంలో వెంకటేష్, సాయిశ్రీల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. గతేడాది నవంబర్ నెలలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వెంకటేష్ ఇంటికి సరిగా రావడంలేదు. చెల్లెల్ని వివాహం చేసుకున్నాడని ఆ తర్వాత విజయవాడలో ఉంటున్నారని అక్క స్రవంతి తెలుసుకుంది. గత నెలలో చెల్లెలు, భర్తపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. శుక్రవారం కుషాయిగూడలో బంధువుల ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని వెంకటేష్, సాయిశ్రీ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.