మెట్రో పనుల్లో ప్రమాదం.. ఇద్దరి మృతి
హైదరాబాద్ మలక్పేట వద్ద జరుగుతున్న మెట్రో రైలు పనుల్లో గురువారం తెల్లవారుజామున ప్రమాదం సంభవించింది. సిమెంటు లారీ బోల్తాపడి ఇద్దరు మరణించారు. అన్సారీ, బాబూలాల్ అనే ఇద్దరు కార్మికులు మరణించినట్లు గుర్తించారు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పిల్లర్ల కోసం తీసిన గుంతల్లో ప్రమాదవశాత్తు సిమెంట్ లారీ బోల్తాపడగా, ఇద్దరు కూలీలు మృతి చెందారు. హైదరాబాద్ మలక్‌పేట్ ఫ్లై ఓవర్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కూలీలు సిమెంట్ పిల్లర్లు వేస్తుండగా, దూసుకొచ్చిన లారీ కూలీలను ఢీకొంటూ గుంతలో పడిపోయింది. దీంతో కూలీలు లారీ కింద ఇరుక్కుపోయారు. కూలీలను బయటకు తీసేందుకు ఆలస్యం కావడంతో వారిద్దరూ మృతిచెందారు. అదృష్టవశాత్తు మరో ఎనిమిదిమంది కూలీలు అదే సమయానికి మంచినీళంలె తాగేందుకు బయటకు వచ్చారు. ఈ ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి కోఠి వరకూ వాహనాలు ఎక్కడికక్కడే గంటలపాటు స్తంభించిపోయాయి.
కాంక్రీటు మిక్సర్ పూర్తిగా తిరగబడిపోయింది. పదిమంది వరకు లోపల ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. నాలుగు గంటలుగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. అయినా కాంక్రీటు మిక్సర్ను తొలగించేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. కార్మికులు కింద పనిచేస్తున్నప్పుడు వారి భద్రతకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలా చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. గతంలో కూడా మలక్పేట వద్ద సుమారు నెల రోజుల క్రితం ఒక వాహనం ఇలాగే గుంతలో పడింది. అయితే ఇంతవరకు మెట్రో అధికారులు ఎవరూ దీనిపై స్పందించలేదు.
మరోవైపు హయత్నగర్ ప్రాంతంలోని పెద్ద అంబర్పేట వద్ద ఇదే సమయంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం లారీ బోల్తాపడి ఇద్దరు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.