టీఆర్‌ఎస్‌తో పొత్తుండదు
బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని బీజేపీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో టీఆర్‌ఎస్ హనీమూన్ ముగిసింది. ప్రజల పక్షాన పోరాటాలను ఇకపై రుచిచూడాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, టీఆర్‌ఎస్ వైఫల్యాలు, వాటిపై పోరాటాల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. ఈ రెండేళ్లలో సత్తా చూపిస్తే భవిష్యత్ ఎన్నికల్లో అధికారం కష్టమేమీ కాదు. పార్టీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఇక నుంచి ప్రతీ నెల అమిత్‌షా రాష్ట్రానికి వస్తారు.
బీజేపీ తడాఖా ఏమిటో టీఆర్‌ఎస్ చూస్తుంది’ అని మురళీధర్‌రావు హెచ్చరించారు. పోరాటాలు చేయడానికి వేచిచూడాల్సిన అవసరం లేదని, తాత్సారం చేస్తే టీఆర్‌ఎస్‌పై వస్తున్న వ్యతిరేకతను కాంగ్రెస్ అందిపుచ్చుకునే అవకాశముందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే అధికారం సంపాదిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌తో ఒకసారి యుద్ధం మొదలైతే అన్నీ సర్దుకుంటాయని మురళీధర్‌రావు చెప్పారు. ప్రజల్లో ఇప్పుడిప్పుడే అసంతృప్తి మొదలైందని, అసలు పోరాటం ఇప్పుడే ఆరంభం అవుతుందన్నారు. రాష్ట్రంలో టీడీపీ లేదనే భావనతోనే పనిచేస్తామన్నారు.