భూగర్భ పంపుహౌసే నయం
‘పాలమూరు’ ప్యాకేజీ-1లో ఖరారు చేసిన నీటి పారుదల శాఖ కమిటీ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒకటో ప్యాకేజీలో భూగర్భ పంపుహౌస్ నిర్మాణమే సరైనదని నీటి పారుదలశాఖ ఉన్నతస్థాయి కమిటీ తేల్చింది. ఉపరితల పంపుహౌస్ నిర్మాణానికి అటవీ శాఖ అడ్డంకులకుతోడు భూగర్భ నిర్మాణంతో భద్రత, పర్యావరణ అనుకూలతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది.ఈ తరహా నిర్మాణంతో వ్యయభారం అదనంగా రూ.50 కోట్లు కూడా దాటదని అంచనా వేసింది.
అటవీ సమస్యతో: ఒకటో ప్యాకేజీలోని స్టేజ్-1 పంపింగ్ స్టేషన్‌ను భూఉపరితలంపై నిర్మించాలని తొలుత నిర్ణయించారు.
అయితే ఆ ప్రాంతం అటవీ భూమి పరిధిలోకి వస్తుం డడం, అటవీ అనుమతులకోసం ఆగితే నిర్మాణంలో జాప్యమయ్యే అవకాశం ఉండడంతో పంపింగ్ స్టేషన్ ప్రాంతాన్ని మార్చాలని భా వించారు. ఈ మార్పు, పెరిగే వ్యయ భారం, ఇతర సానుకూల, ప్రతికూలతలను అంచనా వేసేందుకు నీటి పారుదల శాఖ ఇంజనీర్లతో ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ పరిశీలన జరిపి రెండు రోజుల కింద నివేదిక సమర్పించింది. పంపుహౌస్‌ను భూగర్భంలో నిర్మించడమే సమంజసమని, తద్వారా అట వీ, భూసేకరణ సమస్య తప్పుతుందని పేర్కొంది. స్టేజ్-2, 3, 4 పంపుహౌస్‌లను భూగర్భంలోనే నిర్మిస్తున్నారని.. స్టేజ్-1ను భూగర్భంలోనే నిర్మించాలని సూచించింది.
తొలి అంచనాలతో పోలిస్తే.. దీని నిర్మాణానికి రూ.50కోట్ల వరకు అదనపు వ్యయమయ్యే అవకాశం ఉందంది. అయితే భూసేకరణ, అటవీ భూమి సమస్య తప్పుతున్నందున రూ.50 కోట్ల భారం ఉండదని తేల్చింది. శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్‌కే జోషి జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే కమిటీ నివేదికకు ఆమోదం దక్కే అవకాశం ఉంది.