రైతు ఆత్మహత్యలను ఆపలేని ప్రభుత్వాలను ప్రజలు ఎన్నటికీ క్షమించలేరని ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత ఏడాది జరిగిన రైతు ఆత్మహత్యల వెనకున్న కారణాలను విశ్లేషించి, అవి పునరావృతం కాకుండా పభుత్వాలు చర్యలు తీసుకోవటం లేదని ఆయన తెలిపారు. గడచిన 30 ఏళ్లలో మూడులక్షలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకోగా, ఆ సంఖ్యను తక్కువగా చూపేందుకు కేంద్ర ప్రభుత్వం వారిని రైతు కూలీలుగా చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం ఇక్కడ అంగన్‌వాడీ వర్కర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. అధిక పెట్టుబడులు పెట్టి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రైతుల పరిస్థితి ఇలా ఉంటే సొంత భూములుండీ సాగునీటి సౌకర్యానికి నోచుకోక హమాలీలుగా మారుతున్నారని సాయినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. పల్లె ప్రజల్ని చిన్నచూపు చూసే ప్రభుత్వాలు ఉన్నంతవరకూ మన దేశంలో మార్పు అసాధ్యమన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే లెక్కలు మార్చేసి సరిపెట్టుకుంటారు తప్ప సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించరని అన్నారు.
ఈ సమావేశంలో మాజీ ఐఎఎస్ అధికారి కె.ఆర్ వేణుగోపాల్, అంగన్‌వాడీ వర్కర్స్ ఆలిండియా అధ్యక్షురాలు నీలిమా, తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్ అధ్యక్షురాలు లక్ష్మి, జాయింట్ సెక్రటరీ భారతి, సాయిబాబు, కోర్డినేటర్ ఎ.ఆర్ సింధు తదితరులు పాల్గొన్నారు.