♦ త్వరలో కన్జర్వెన్స్ పోర్టల్
♦ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు స్థల సేకరణ
♦ అధికారుల సమన్వయ సమావేశంలో నిర్ణయం
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు వేల ప్రాంతాల్లో ఉచిత వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య పూర్తి స్థాయి సమన్వయం కోసం కన్జర్వెన్స్ పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వీలైనంత త్వరగా సేకరించనున్నారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ కార్యాలయంలో శనివారం వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలోని 200 ఉచిత వైఫై కేంద్రాలను రోజుకు సగటున 21 వేల మంది వినియోగించుకుంటున్నారని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన కన్జర్వెన్స్ పోర్టల్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా తమ దృష్టికి వచ్చే సమస్యలను గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు ప్రతి శాఖ ప్రత్యేకంగా ఒక్కో నోడల్ అధికారిని నియమించుకోవాలని ఆయన సూచించారు. వేసవి దృష్ట్యా నీటిని పొదుపుపై ప్రజలకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు మాట్లాడుతూ మూసీకిఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వివరాలు అందజేయాల్సిందిగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను కోరారు.
ఈ భూముల్లో పర్యాటక, వాణిజ్యపరమైన భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని, వాటిలో కనీస సదుపాయాలు కల్పించాలని రెండు జిల్లాల కలెక్టర్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డిని కోరారు. రోడ్లపై విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాల్సిందిగా ట్రాఫిక్ అధికారులు సూచించారు. సింగిల్ లేన్ రోడ్లపై బస్‌బేల కోసం స్టీల్ బారికేడ్లు ఏర్పాటు చేయవద్దని కోరారు. సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, కంటోన్మెంట్ సీఈఓ సుజాత గుప్తా, ట్రాఫిక్ డీసీపీ ఎల్ ఎస్ చౌహాన్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.