ఆ విమానం సముద్రంలో కూలింది | 5 things to know about the Malaysian plane crash | Sakshi
Sakshi News home page

ఆ విమానం సముద్రంలో కూలింది

Published Tue, Mar 25 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

ఆ విమానం సముద్రంలో కూలింది

ఆ విమానం సముద్రంలో కూలింది

దక్షిణ హిందూ మహాసముద్రంలో పడిపోయిందన్న మలేసియా ప్రధాని నజీబ్
శాటిలైట్ సమాచారంతో నిర్ధారణకు వచ్చాం

 
కౌలాలంపూర్: అనుమానం నిజమైంది.. మిణుకుమిణుకుమంటున్న ఆశాదీపం ఆరిపోయింది! 17 రోజుల కిందట గల్లంతైన మలేసియా విమానం కథ నడిసముద్రంలో ముగిసింది. ఐదుగురు భారతీయులు సహా 239 మంది ఉన్న ఈ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో మారుమూల కూలిపోయిందని, అందులోని వారెవరూ బతికి బయటపడలేదని మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ విషణ్ణ వదనంతో ప్రకటించారు. ఆయన సోమవారం కౌలాలంపూర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. విషాదానికి చిహ్నంగా ఆయన నల్లదుస్తులతో సమావేశానికి వచ్చారు.
 
పెర్త్‌కు పశ్చిమంగా.. : ‘ఫ్లైట్ ఎంహెచ్370 విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిందని తీవ్ర విచారం, బాధ తో చెబుతున్నా. బ్రిటన్‌కు చెందిన ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(ఏఏఐబీ) తాజా విశ్లేషణ, బ్రిటిష్ శాటిలైట్ కంపెనీ ఇన్‌మార్సాత్ అందించిన ఉపగ్రహ సమాచారం ప్రకారం విమానం దక్షిణ కారిడార్ మీదుగా ఎగిరి, ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు పశ్చిమంగా దక్షిణ హిందూమహాసముద్రం నట్టనడుమ చివరిసారిగా కనిపించినట్లు  నిర్ధారణకు వచ్చాం. ఇది ఇప్పటికే బాధలో ఉన్న కుటుంబాలకు నిజంగా గుండెలు పగిలే వార్తే’ అని రజాక్ చెప్పారు. విమానం కూలిన ప్రాంతం ల్యాండింగ్ స్థలాలకు చాలా దూరంగా మూరుమూల ఉందన్నారు. బాధ్యత ప్రకారం ఈ సమాచారాన్ని మలేసియా ఎయిర్‌లైన్స్ అధికారులు.. ప్రయాణికులు, సిబ్బంది కుటుంబాలకు తెలిపారన్నారు.
 
 మంగళవారమూ విలేకర్ల సమాచారాన్ని నిర్వహిస్తాన న్న ఆయన.. ఈ ఉదంతంపై మరింత సమాచారాన్ని వెల్లడించనున్నట్లు సంకేతమిచ్చారు. దక్షిణ హిందూమహాసముద్రంలో ఐదురోజులుగా సాగుతున్న గాలింపులో.. గల్లంతైన విమానానివిగా భావిస్తున్న శకలాలను గుర్తించిన నేపథ్యంలో నజీబ్ ఈ వివరాలు తెలిపారు. గల్లంతైన విమానంలోని వారి కుటుంబాలకు మలేసియా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. విమానం సముద్రంలో కూలిందన్న వార్త తెలిసి బీజింగ్‌లోని ఓ హోటల్లో ఉన్న ప్రయాణికుల బంధుమిత్రులు ఒకరినొకరు పట్టుకుని గుండెలవిసేలా రోదించారు.  మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ఈ నెల 8న మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వెళ్తూ.. బయల్దేరిన గంటసేపటికే అదృశ్యమవడం తెలిసిందే. ఇది సముద్రంలో కూలినట్లు భావిస్తున్నా కచ్చితంగా ఎక్కడ, ఎందువల్ల కూలిందో స్పష్టత రావడం లేదు. దీని కోపైలట్ ఫరీక్ తొలిసారిగా చెక్-కోపైలట్ లేకుండానే విమానం ఎక్కినట్లు సమాచారం.   
 
శకలాల కోసం గాలింపు..: పెర్త్ నగరానికి 2,300 కి.మీ దూరంలో సముద్రంలో తేలియాడుతున్న విమాన శకలాలుగా భావిస్తున్న రెండు వస్తువులను స్వాధీనం చేసుకోవడానికి ఆస్ట్రేలియా నౌక సోమవారం ప్రయత్నించింది. వీటిలో ఒకటి బూడిద  లేదా ఆకుపచ్చ రంగులో గుండ్రం గా, మరొకటి నారింజ రంగులో ఉందని, అయితే ఇవి మలేసియా విమానానివో కావో చెప్పలేమని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ చెప్పారు. అదే ప్రాంతంలో తెల్లగా చతురస్రాకారంలో ఉన్న వస్తువులు తమ విమానానికి కనిపించాయని చైనా తెలిపింది. ఎంహెచ్370లో చెక్కబల్లలు ఉన్నాయని, అయితే సముద్రంలో కనిపించిన చెక్కబల్ల ఆ విమానంలోనిదే అని చెప్పలేమని మలేసియా మంత్రి హుసేన్ అన్నారు. విమాన బ్లాక్‌బాక్సులు సముద్రంలో 20 వేల అడుగుల కింద ఉన్నా పసిగట్టే ‘టోవ్డ్ పింగర్ లొకేటర్ 25’ పరికరాన్ని పంపుతున్నట్లు అమెరికా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement