9/11 స్మారక మ్యూజియం | 9/11 Memorial Museum | Sakshi
Sakshi News home page

9/11 స్మారక మ్యూజియం

Published Thu, Sep 18 2014 7:29 PM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

9/11 స్మారక మ్యూజియం - Sakshi

9/11 స్మారక మ్యూజియం

అది న్యూయార్క్ నగరం. 13 సంవత్సరాల క్రితం జరిగిన సెప్టెంబర్ 11 సంఘటనను  సజీవ సాక్ష్యంగా ఉంచేందుకు గ్రౌండ్ జీరోవద్ద అమెరికా ప్రభుత్వం ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది.  ప్రపంచాన్ని కుదిపేసిన సెప్టెంబర్ 11 సంఘటన తాలుకు అనుభవాలను, శిథిలాలను, మృతుల చిత్రాలతో చేదు జ్ఞాపకాలను ఇక్కడ పదిలం చేశారు. ప్రపంచ ప్రజల వ్యక్తిగత జీవితంపై ఉగ్రవాదం నిర్దయగా, అమానుషంగా జరుపుతున్న దాడులను, దాని ప్రభావాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజెప్పేందుకే స్మారక మ్యూజియాన్ని నిర్మించారు. ఇది ప్రపంచంలోని ఉగ్రవాదం పుట్టుక, వ్యాప్తి, తదితర అంశాల గురించి అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

 ఉగ్రవాదుల దాడి జరిగి 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల గ్రౌండ్ జీరో వద్ద స్మారక సమావేశాన్ని నిర్వహించారు. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారి పేర్లను చదివారు. మృతుల బంధువులతో పాటు వందలాది మంది ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పిల్లలతో సహా పలువురు మృతులకు పుష్పాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మ్యూజియాన్ని ఎక్కడో కాకుండా ఉగ్రవాదులు కూల్చి వేసిన ఆ రెండు టవర్ల అడుగు భాగమైన భూగర్భంలో నిర్మించారు. తమ దేశ ప్రజాస్వామ్య విధానాన్ని, ఆర్థిక మూలాలను ఉగ్రవాదులు రూపు మాపలేరని, ఇలాంటి అమానుషమైన దాడులను ఐక్యంగా ఎదుర్కొంటామనే సందేశం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. ఉగ్రవాదులు విసిరిన పంజాకు తాము భయపడడంలేదని, దానిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామనే సందేశాన్నిస్తున్నారు.

సెప్టెంబర్ 11ని అమెరికా ప్రభుత్వం సేవా దినంగా ప్రకటించింది.అసాధారణ పరిస్థితుల్లో సామాన్య ప్రజలు చూపిన తెగువకు ప్రశంసపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అగ్నిమాపక దళం సేవలకు గుర్తింపుగా అనేక శకటాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ ఘోర సంఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన వేయి మంది బాధితులు అనుభవించిన బాధను, ఆక్రోశాన్ని రికార్డు చేశారు. సందర్శకులు తమ అభిప్రాయాన్ని రికార్డు చేసేందుకు ప్రత్యేకంగా స్డూడియోను నిర్మించారు. 2013లో అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా ఈ మ్యూజియాన్ని సందర్శించారు.  ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపుతామని ప్రకటించారు. ఈ సంవత్సరం మే 21న సర్వ హంగులతో మ్యూజియం ప్రారంభించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో 2001  సెప్టెంబర్ 11న జరిగిన ఈ సంఘటన నుంచి అమెరికా అనేక గుణపాఠాలు నేర్చుకుంది. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విదేశాల నుంచి తమ దేశంలోకి వస్తున్న వారి వివరాలు పూర్తిగా సేకరించిన తరువాతనే సెక్యూరిటీ అధికారులు అనుమతిస్తున్నారు. ప్రతి మనిషిని అణువణువు సోదిస్తున్నారు.ఇమిగ్రేషన్ నిబంధనలు కఠిన తరం చేశారు. గతంలో మాదిరిగా ఎక్కువ వీసాలు జారీ చేయడం లేదు. ప్రతి మనిషి ముఖచిత్రం, అరచేతి, బొటన వేలి ముద్రలు తీసుకుంటున్నారు. ఇతర విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. తమ దేశంలోకి ఇతర దేశాల నుంచి విత్తనాలను, పళ్లను తీసుకు రానీయడం లేదు. ప్రతి బ్యాగ్‌ను శునకాలు తనిఖీ చేసిన అనంతరమే బయటకు తీసుకు వెళ్లనిస్తున్నారు. ఇవన్నీ సెప్టెంబర్ 11 సంఘటన ప్రభావమే. ఇతర దేశాలకు చెందిన ప్రజలు సోదాలు పూర్తి చేసుకునేందుకు నిర్ణీత సమయం కంటె రెండు గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవలసి వస్తోంది. అంతకు ముందు అమెరికా పాలకులకు తమ దేశంలో ఏమి జరగదన్న ధీమా ఉండేది. ఈ సంఘటనతో అమెరికాలోని భద్రతా చర్యలలోని డొల్లతనం బయటపడింది.  ఈ వాదనకు బలం చేకూరుస్తున్న వీడియో మ్యూజియంలో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.

 అందులోని వివరాల ప్రకారం...
సెప్టెంబర్ 11 ఉదయం 8 గంటలకు ఆల్‌ఖైదాకు చెందిన 19 మంది ఉగ్రవాదులు 4 విమానాలను హైజాక్ చేశారు. అందులో రెండు విమానాలు బోస్టన్ నుంచి లాస్‌ఏంజిలిస్ వెళుతుండగా ఉగ్రవాదులు దారి మళ్లించారు. వెంటనే ట్రాన్స్‌పాండర్లను నిలిపి వేశారు. గల్లంతైన విమానాల జాడ తెలుసుకునేందుకు రెండు యుద్ధ విమానాలు బయలు దేరాయి. కానీ ఈ లోపే  ఉగ్రవాదులు వాటిని దారి మళ్లించి న్యూయార్క్‌లోని రెండు వాణిజ్య కేంద్రాలను ఢీకొట్టారు. కొద్ది నిమిషాలలోనే ఆ రెండు టవర్లు మంటల్లో కాలిపోయాయి. మరో రెండు విమానాల్లో ఒకటి వాషింగ్టన్ డీసీ నుంచి లాస్ ఏంజిలిస్ వెళుతుండగా హైజాక్ చేశారు. అర్లింగ్‌కౌంటీలోని పెంటగాన్ మిలటరీ స్థావరంపై కూల్చివేశారు. ఇక నాలుగవ విమానం న్యూజెర్సీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళుతుండగా, దానిని కూడా దారి మళ్లించి అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీపై దాడికి విఫలప్రయత్నం చేశారు. అయితే ఉగ్రవాదుల ప్రయత్నాన్ని ప్రయాణికులు అడ్డుకోవడంతో దానిని పెన్సిల్వేనియా పొలాల్లో కూల్చి వేశారు. ఈ 4 సంఘటనల్లో మూడు వేల మంది మరణించారు. సుమారు వేయి మృతదేహాలు గుర్తించలేనంతగా మాడిపోయాయి. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారి పేర్లను గ్రౌండ్ జీరో వద్ద నిర్మించిన రెండు స్మారక చిహ్నాలపై రాశారు. ప్రతి రోజు మరణించిన వారికి శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. మరణించిన వారిలో అనేక మంది భారతీయులు కూడా ఉన్నారు. అందులో శేఖర్ కుమార్ ఒకరు. రెండు టవర్లను కూల్చి వేసిన స్థలాల్లో చతురస్రాకారంలో గోడలు నిర్మించి, నీటితో ఫౌంటెన్లను ఏర్పాటు చేశారు. ఆ పక్కనే స్మారక మ్యూజియాన్ని నిర్మించారు. అమెరికా ప్రభుత్వం దీనికొక ట్రస్టును ఏర్పాటు చేసింది.
            
 పాకిస్తాన్ జాతీయుడైన ఖాలీద్ షేక్ మహ్మద్ 1996లోనే ఆల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌తో కలసి ప్రపంచ వాణిజ్య టవర్లపై దాడికి వ్యూహ రచన చేశాడు. అతడే ఈ దాడులకు సూత్రధారిగా వ్యవహరించాడని యూఎస్ విచారణ సంఘం నిర్ధారించింది. ఇజ్రాయిల్ అనుకూల విధానాన్ని అమెరికా అనుసరించినందు వల్లనే ఖాలీద్ షేక్ కక్ష పెంచుకున్నాడని ఆ నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా సీఐఏకు ఉగ్రవాదుల దాడి గురించి ముందే తెలిసినప్పటికీ, ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనివెస్టిగేషన్) ను అప్రమత్తం చేయడంలో విఫలమైందని కూడా ఆ నివేదిక పేర్కొంది. కేవలం 14 రోజుల ముందు ఎఫ్‌బీఐకి ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం తెలిసినప్పటికీ వారు ఎక్కడ తలదాచుకున్నారనే విషయాన్ని కనుక్కోలేక పోయారు. సెప్టెంబర్ 11 సంఘటనకు ముందు 1993లోనే ఖాలీద్ షేక్ సమీప బంధువు రమ్జీ యూసుఫ్  డబ్ల్యూటీసీ దక్షిణ టవర్‌లో బాంబు పేల్చాడు. ఈ సంఘటనలో ఆరుగురు మరణించగా, వేయి మంది గాయపడ్డారు. ఈ సంఘటనతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. భూమ్మీద  బాంబులు పేల్చలేమని గ్రహించిన ఉగ్రవాదులు గగనతలం నుంచి విమానాలతో దాడికి రూప కల్పన చేశారు. ఉగ్రవాదులు తమ లక్ష్యాలపై దాడులు నిర్వహించేందుకు కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. దీనికి సజీవ ఉదాహరణ 2008 సంవత్సరం నవంబర్ 26న ముంబైపై జరిగిన దాడి. ఉగ్రవాదులు ఎవరూ ఊహించని రీతిలో సముద్రమార్గాన భారత్‌లోకి చొరబడి దాడులు నిర్వహించారు. అమెరికాలో మాదిరిగానే ముంబైలో కూడా భారత్ ప్రభుత్వం ఒక స్మారక మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తే అర్థవంతంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
1998లోనే అమెరికాపై ఫత్వా జారీ చేసిన బిన్‌లాడెన్
ఒకప్పుడు ప్రపంచంపై ఆధిపత్యం సంపాదించేందుకు అమెరికా, రష్యా పోటీ పడేవి. రష్యాలో సోవియట్ యూనియన్ పతనమయ్యాక అమెరికా ఏకాఛత్రాధిపత్యం పెరిగింది. సహజ వనరులు, ముఖ్యంగా విలువైన ఇంధన నిలువలు ఎక్కువగా ఉన్న గల్ఫ్ దేశాలపై పట్టుసాధించేందుకు అమెరికా పూనుకుంది. ఇరాక్, ఇజ్రాయిల్ దేశాల మధ్య శతృత్వాన్ని పెంచి పోషించింది. ఈ అంశాలు ఇస్లాం ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయి. ఈ అసంతృప్తుల నుంచి పుట్టి పెరిగినవే ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలు.

ఈ సందర్భంగానే 1998లో ఈ సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్ అమెరికాకు వ్యతిరేకంగా ’ఫత్వా’ జారీ చేశారు. మూడు సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో 19 మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి అమెరికాలో దాడులకు పంపించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో అమాయకులే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రపంచం నుంచి ఉగ్రవాదాన్ని తరిమివేసి, సుఖశాంతులతో ప్రతి మానవుడు జీవించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడమే ధ్యేయమని సెప్టెంబర్ 11 స్మారక మ్యూజియం నిర్వహకులు ప్రకటించారు.
- జి.గంగాధర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement