ఆ పాప మహాద్భుతం.. బరువు ఐపాడంతే..!
యూఏఈ: ప్రపంచంలో ఏదో ఒక మూలన ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్నవి తప్ప తెలియకుండా జరిగేవి కోకొల్లలు. అయితే, మనుషుల మధ్య కూడా కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని చాలా అరుదు. అలాంటి అరుదైన సంఘటనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబిలో చోటు చేసుకుంది. ఓ మహిళకు ఐపాడ్ కంటే తక్కువ బరువున్న కూతురు జన్మించింది. గర్భం సంబంధమైన సమస్యలు రావడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించి అటు తల్లికి, బిడ్డకు ప్రాణం పోశారు.
ఈ పాప జన్మించినప్పుడు బరువు 631 గ్రాములు మాత్రమే ఉండగా ప్రస్తుతం ప్రత్యేక సంరక్షణలో ఆ నవజాత శిశువును పెంచడంతో ఆ పాప ఇప్పుడు రెండు కిలోల వరకు పెరిగింది. అబుదాబిలోని ది మీడియర్ 24x7 అనే ఆస్పత్రికి బలహీన స్థితిలో ఉన్న ఓ గర్భవతి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భంలోని శిశువు పెరుగుదల మందగించినట్లు గుర్తించారు. దాంతోపాటు పిండం చుట్టూ ఉండాల్సిన స్రవాలు తల్లి గర్భంలో విడుదల కానట్లు తెలుసుకున్నారు.
ఇలాంటి పరిస్థితిలో ఆపరేషన్ చేయకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. అప్పటికీ సరిగ్గా 26.5వారాలు మాత్రమే.. అంటే ఆరు నెలలు మాత్రమే. అయినప్పటికీ గోవిందా షెనాయ్ నేతృత్వంలో ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు సురక్షితంగా ఆమెకు పురుడు పోశారు. కేవలం 631 గ్రాములు మాత్రమే ఉన్న పసిగుడ్డును చూసి ఆస్పత్రి సిబ్బంది సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ప్రస్తుతం తల్లి కూతురు సురక్షితంగా ఉండటంతో ఆ బేబిని మిరాకిల్ బేబీగా చెప్తున్నారు.