'ఆ చావులకు మీరు క్షమాపణ చెప్పాల్సిందే'
మలేసియా విమానం ఎంహెచ్17 కూలిపోయి మొత్తం అందులో ఉన్నవారంతా మరణించిన ఘటనపై మృతుల కుటుంబాలకు రష్యా క్షమాపణ చెప్పి, తగిన పరిహారం చెల్లించాలని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అబాట్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అపెక్ సమావేశాల నేపథ్యంలో అబాట్ పావుగంట పాటు చర్చించారు.
వీరిద్దరి మధ్య చర్చల్లో కూడా ప్రధానాంశం మలేసియన్ ఎయిర్లైన్స్ విమాన దుర్ఘటనేనని సిన్హువా వార్తాసంస్థ తెలిపింది. జూలై నెలలో ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎంహెచ్17 దుర్ఘటనలో అందులో ఉన్న మొత్తం 298 మందీ మరణించారు. వాళ్లలో 38 మంది ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ స్పందించినట్లు తెలుస్తోంది.