గోవాలో టూరిస్టు మృతిపై అమెరికా సీరియస్
పనాజీ: అమెరికన్ టూరిస్ట్ హోల్ట్(30) పనాజీ ప్రాంతంలో అనుమానాస్పద మృతి ఘటనను అమెరికా అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి వివరాలను అందించాలని భారత అధికారులను కోరారు. అంతేకాదు.. అమెరికాకు చెందిన ఓ ఉన్నత స్థాయి విచారణ బృందం దీనిపై విచారణ చేపట్టింది.
టూరిస్టు మృతిపై లోకల్ పోలీసు అధికారి ఉమేష్ గ్వాంకర్ మాట్లాడుతూ.. 'ఓ వ్యక్తి బురదలో కూరుకుపోయి ఉండటం గమనించి అతన్ని బయటకు తీశాం. అతని వద్ద లభించిన పాస్పోర్ట్ సహాయంతో అతడిని అమెరికాకు చెందిన వ్యక్తిగా గుర్తించాం. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడె మృతి చెందాడు. అంతకు ముందు అతని భాష అర్థం కాకపోవడంతో దొంగగా భావించిన గ్రామస్తులు తరమడంతో పారిపోయే క్రమంలో బురదలో కూరుకుపోయినట్లు తెలుస్తోంద'న్నారు. మరోవైపు గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ టూరిస్టు మృతిని ఓ యాక్సిడెంట్గా కొట్టిపారేశారు. కాగా, ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసేలా ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.