సిరియాలో ఆత్మాహుతి దాడి.. 51 మంది మృతి
బీరట్: సిరియాలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీ మద్దతిస్తున్న రెబల్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. సుసియాన్ లోని రెబల్ కమాండ్ సెంటర్ వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనాన్ని ఆత్మాహుతి సభ్యుడు పేల్చివేసినట్లు మానవ హక్కుల సంస్థ తెలిపింది. 51 మంది మరణించారని, వారిలో ఎక్కువ మంది పౌరులే అని తెలిపింది.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ నుంచి ప్రభుత్వబలగాలు అల్ బాబ్‌ను స్వాధీనం చేసుకున్న కొద్ది గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థే దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. కాగా, అల్ బాబ్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఆత్మాహుతి దాడిలో మరో ఇద్దరు టర్కీ సైనికులు మృతి చెందారని ప్రధాని బినాలి యిల్డిరిమ్ తెలిపారు. టర్కీ సరిహద్దుకు 25 కిలోమీటర్ల దూరంలోని అల్‌బాబ్ పట్టణంలో ఐఎస్‌కు గట్టి పట్టు ఉండేది.