శాంతికోసం మరేదైనా చేయండి
♦ చర్చలపై ఏకాభిప్రాయంవస్తున్నపుడు క్షిపణులెందుకు?
♦ బ్రహ్మోస్ మోహరింపుపై చైనా వ్యాఖ్య
బీజింగ్: భారత్, చైనా దేశాల మధ్య చర్చల ప్రక్రియపై ఏకాభిప్రాయం వస్తున్న తరుణంలో సరిహద్దుల్లో భారత్ క్షిపణులను మోహరించటం సరైంది కాదని చైనా వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత ఆర్మీ బ్రహ్మోస్ క్షిపణలను పంపిస్తుండటంపై రెండ్రోజులుగా నిప్పులు చెరిగిన చైనా గురువారం తన స్వరాన్ని తగ్గించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవటంతోపాటు శాంతి నెలకొనేందుకు ఉద్దేశించిన చర్చల ప్రక్రియలో పురోగతి ఉన్న సమయంలో క్షిపణులను మోహరించడం తగదని తెలిపింది. చర్చల ప్రక్రియకు భంగం కలిగించేలా భారత్ విరుద్ధంగా ప్రవర్తించకూడదంది.
‘భారత్, చైనా దేశాల మధ్య శాంతి, స్థిరత్వం నెలకొనేందుకు జరుగుతున్న చర్చల్లో కీలకమైన ఏకాభిప్రాయం కుదిరినట్లే. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు భారత్ ఇతర కార్యక్రమాలు చేపట్టవచ్చు. కానీ ఇలాంటి చర్యలు వద్దు’ అని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి వు కియాన్ గురువారం తెలిపారు. భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు మరో సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణిని తరలించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చైనా రక్షణ శాఖ ఈ ప్రకటన చేసింది. అటు చైనా సరిహద్దుల్లో రూ.4,300 కోట్లతో నాలుగో బ్రహ్మోస్ రెజిమెంట్ ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పిందని ఢిల్లీలోని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.