పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. 2007 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సర్కోజీకి నాటి లిబియా నియంత గడాఫీ నుంచి ధన సహాయం లభించిందన్న ఆరోపణలపై పోలీసులు ఆయనను విచారించ నున్నారు. 2013 నుంచి దర్యాప్తు సాగుతున్న ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా సర్కోజీకి నోటీసులు పంపినా ఆయన స్పందించలేదు. దీంతో పోలీసులు సర్కోజీని అరెస్టు చేశారు.
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రచార ఖర్చుల కోసం గడాఫీ నుంచి డబ్బు తీసుకెళ్లి సర్కోజీ మనుషులకు ఇచ్చానని ఓ వ్యాపారవేత్త గతేడాది నవంబరులో చెప్పడంతో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. సర్కోజీకి ఎన్నికల ఖర్చులకు డబ్బు పంపించామని గతంలో గడాఫీతోపాటు ఆయన కొడుకు సీఫ్ అల్–ఇస్లాం కూడా చెప్పారు. అయితే అమెరికా సైన్యంతో కలసి లిబియాలో 41 ఏళ్ల గడాఫీ పాలనను ముగించినందుకే తనపై వారు ఆరోపణలు చేశారని సర్కోజీ వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment