ప్రతీకారంతో రగిలిపోతున్న ఫ్రాన్స్
పారిస్/డమాస్కస్: రాజధాని పారిస్ నగరంలో జరిగిన ఉగ్రదాడిని ఫ్రాన్స్ తీవ్రమైన అంశంగా తీసుకుంది. సిరియాలో తమ దాడులను మరింత ముమ్మరం చేసి వేగాన్ని పెంచినట్లు కనిపిస్తోంది. రాత్రికి రాత్రి ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఫ్రెంచ్ యుద్దవిమానాలు మంగళవారం వేకువజామున తమ దాడులను ఉదృతం చేశాయి. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రమైన తూర్పు ప్రాంతంలో ఉన్న రఖా నగరంపై ఫ్రెంచి యుద్ద విమానాలు దాడులు చేసి ఓ ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని, ఓ స్థావరాన్ని నేలమట్టం చేశాయి. ఈ విషయాన్ని ఫ్రెంచి ఆర్మీ విభాగానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు.
సోమవారం ఐఎస్ఐఎస్ స్థావరాలపై దాడులు నిర్వహించిన 24 గంటల్లోనే మరో బలగాన్ని సిరియాకు పంపి దేయిష్ అనే గ్రూపును ఫ్రాన్స్ ఆర్మీ కట్టుదిట్టం చేసింది. జిహాద్ అంటూ అల్లకల్లోలం సృష్టించే మరో గ్రూపు దేయిష్ అని ఫ్రెంచ్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పారిస్ ఘటనకు ప్రతీకారం తీర్చుకునే యత్నంలో ఫ్రాన్స్ చాలా మేరకు సత్పలితాలు పొందినట్లుగా కనిపిస్తోంది. గత శుక్రవారం పారిస్లో సిరియా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 129 మందికి పైగా మృతిచెందిన విషయం అందరికీ విదితమే.