హిల్లరీ అభ్యర్థిత్వం ఖరారు!
అమెరికా అధ్యక్ష రేసులో దిగనున్న తొలి మహిళగా క్లింటన్ రికార్డు
- 2,383 మంది డెలిగేట్ల మద్దతు.. డెమోక్రాట్‌ల అభ్యర్థిగా బరిలోకి..
శాన్ ఫ్రాన్సిస్కో: అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల బరిలో హిల్లరీ క్లింటన్ సరికొత్త రికార్డుకు చేరువలో ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆమె అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లేనని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండేందుకు 2,383 మంది డెలిగేట్లు, సూపర్ డెలిగేట్ల మద్దతుండాలి. అయితే.. ఇప్పటివరకు జరిగిన ప్రైమరీల్లో హిల్లరీకి 1,812 మంది డెలిగేట్లు, రెండో స్థానంలో ఉన్న శాండర్స్‌కు 1,521 మంది మద్దతు తెలిపారు. మరో రెండు కీలక ప్రాంతాలైన కాలిఫోర్నియా (475), న్యూజెర్సీ (126)తోపాటు ఐదు చిన్న రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు మిగిలుండగానే క్లింటన్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు ఏపీ వెల్లడించింది. అధ్యక్ష బరిలో నిలిచేవారి అభ్యర్థిత్వం ఖరారు చేయటంలో కీలకంగా మారిన మొత్తం 714 సూపర్ డెలిగేట్లలో 571 మంది హిల్లరీవైపు ఉన్నారని తమ సర్వేలో తేలిందని దీని ఆధారంగా ఇప్పుడున్న డెలిగేట్లు, సూపర్ డెలిగేట్లు కలుపుకుని మొత్తం 2,383 మంది మద్దతుందని ఏపీ వెల్లడించింది.
భర్తను గాయపర్చిన హిల్లరీ
వాషింగ్టన్:హిల్లరీ క్లింటన్‌పై తాజా పుస్తకం సంచలనం రేపుతోంది. జూన్ 28న విడుదల కానున్న ‘క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్’ అనే ఈ పుస్తకంలో వైట్‌హౌస్ మాజీ సీక్రెట్ సర్వీస్ అధికారి గ్యారీ జే బయర్న్ కొన్ని ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. 1995 వేసవిలో బిల్ క్లింటన్‌తో హిల్లరీ తీవ్ర ఆగ్రహంతో పెద్దగా గొడవ పడ్డారని, ఫ్లవర్ వాజ్ భారీ శబ్దంతో పగలడం వినిపించిందని పుస్తకంలో పేర్కొన్నారు. తర్వాతి రోజు కంటి చుట్టూ నల్లని వలయంతో కూడిన గాయంతో బిల్ కనిపించారని, అయితే క్లింటన్‌కు కాఫీ అంటే అలర్జీ ఉండ టంతో కంటికి సమస్య వచ్చిదంటూ వ్యక్తిగత పర్యవేక్షకురాలు చెప్పారన్నారు.