భారత్ లో కన్నా అమెరికాలోనే పదిలం!
వాషింగ్టన్ : అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు స్వదేశంతో పోల్చితే తమకు అక్కడే సౌకర్యంగా ఉందంటున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న 500 మందిపై నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అవకాశాల భూమి అమెరికా అని భారత్కు చెందిన ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే, తమ జాబ్ రిటైర్మైంట్ మాత్రం స్వదేశంలోనే చేయాలనుకోవడం గమనార్హం. తాము చేస్తున్న ఉద్యోగానికి అర్హత కంటే ఎక్కువ నైపుణ్యం తమలో ఉందని సర్వేలో పాల్గొన్న 83 శాతం ఉద్యోగులు చెప్పారు. ఇదిలా ఉండగా, భారత్తో పోల్చితే అమెరికాలో జాబ్ టెన్షన్ చాలా తక్కువగా ఉందని 63 శాతం మంది పేర్కొన్నారు.
ఊహించిన జీతం తాము అందుకుంటున్నామని 65 శాతం మంది, అనుకున్న వేతనాన్ని పొందడానికి అదనపు సమయాన్ని వెచ్చించాల్సి వస్తుందని 61 శాతం ఉద్యోగులు చెప్పారు. ఏది ఏమైతేనేం, స్వదేశంతో పోల్చి చూస్తే తమకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు, డెవలప్మెంట్, తక్కువ ఒత్తిడి వంటివి కలిసొచ్చే అంశాలని అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు భావిస్తున్నారని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.