'గే' చేతికి అమెరికా ఆర్మీ పగ్గాలు?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఆర్మీ పగ్గాలు ఓ 'గే'(స్వలింగ సంపర్కుడు) చేతికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. యూఎస్ తదుపరి ఆర్మీ సెక్రటరీగా 'గే' అయిన ఎరిక్ ఫాన్నింగ్ను బరాక్ ఒబామా నామినేట్ చేశారు. ప్రస్తుతం ఎరిక్ యూఎస్ అండర్ సెక్రటరీ ఆఫ్ ఆర్మీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సెనెట్ కూడా ఆమోదం తెలిపితే 'గే' గా బయటకు చెప్పుకొని యూఎస్ ఆర్మీకి సారధ్యం వహించిన మొదటి వ్యక్తి ఎరిక్ అవుతాడు. ఎరిక్కు యూఎస్ ఆర్మీలో ఉన్న అపారమైన అనుభవం, అసాధారణమైన నాయకత్వ లక్షణాలు కొత్త బాధ్యతలు అప్పగించేలా చేశాయని ఒబామా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూఎస్ ఆర్మీని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలపడానికి ఎరిక్తో కలిసి పని చేస్తామని ఒబామా తెలిపారు.