పాక్ చర్చిలపై తాలిబాన్ పంజా
- లాహోర్‌లో ఆత్మాహుతి దాడులు
- 15 మంది మృతి, 80 మందికి గాయాలు
- ఇద్దరు తీవ్రవాదుల్ని తగలబెట్టిన స్థానికులు
లాహోర్: పాకిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. సెలవు దినమైన ఆదివారం లాహోర్‌లోని రెండు చర్చిలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 80 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించిన స్థానికులు వారిని చితకబాది సజీవదహనం చేశారు. లాహోర్‌లో క్రైస్తవులు అధికంగా నివసించే యుహానాబాద్‌లోని చర్చిలపై ఈ దాడులు జరిగాయి.
యుహానాబాద్‌లోని రెండు చర్చిలలో క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. భద్రతా దళాలు వీరిని అడ్డుకున్నాయి. దాంతో బాంబర్లు గేట్ల వద్దే తమను తాము పేల్చేసుకున్నారు. ఇద్దరు భద్రతా సిబ్బంది, ఓ బాలుడు, బాలికసహా 15 మంది మృతిచెందారు. జనం చర్చిల నుంచి బయటకు పరుగెత్తడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మాహుతి బాంబర్లను గేట్ల వద్దే ఆపేయడంతో చర్చిల్లోని వారు ప్రాణాలతో బయటపడ్డారు.
బాంబర్లతోపాటు వచ్చిన ఇద్దరిని స్థానికులు ఉగ్రవాదులుగా గుర్తించి చితకబాదారు. తర్వాత నిప్పంటించి సజీవ దహనం చేశారు. ఉగ్రవాదులవిగా భావిస్తున్న వాహనాలకు సైతం నిప్పుపెట్టారు. చర్చిలపై దాడిని ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. దాడులు జరిగిన యుహానాబాద్‌లో 10 లక్షల మంది క్రైస్తవులు నివసిస్తున్నారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని పాక్‌లోని తెహ్రికే తాలిబాన్ అనుబంధ సంస్థ జమాతుల్ అహరర్ ప్రకటించింది.
అఫ్ఘాన్‌లో 54 మంది మిలిటెంట్ల హతం
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ మూకలపై సైన్యం దాడులు ముమ్మరం చేసింది. గడిచిన 24 గంటల్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మొత్తం 54 మంది తీవ్రవాదులు హతమయ్యారని ఆర్మీ ప్రకటించింది.