'2016ను చూస్తాననుకోలేదు'
దుబాయ్: నూతన సంవత్సర వేడుకల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా పక్కనే ఉన్న అడ్రస్ డౌన్ టౌన్ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 63 అంతస్తుల హోటల్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలలో చిక్కుకున్న ఓ ఫోటోగ్రాఫర్ గంటపాటు విండో క్లీనింగ్ ప్లాట్ఫాం వద్ద తాడు సాయంతో నిలబడి ప్రాణాలను దక్కించుకున్నాడు. నూతన సంవత్సర వేడుకల లైటింగ్, బాణాసంచా వెలుగులను తాను పని చేస్తున్న వార్తాపత్రిక కోసం కెమెరాలో బంధించడానికి అతడు హోటల్కు వెళ్లాడు. ఇందులో భాగంగా హోటల్ బాల్కనీలో నిలబడిన సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో గంట పాటు సహాయం కోసం ఎదురు చూసిన ఫోటోగ్రాఫర్ను సహాయక బలగాలు ప్రాణాలతో కాపాడాయి.
ఈ ఘటనపై సదరు ఫోటోగ్రాఫర్ మాట్లాడుతూ 'బాల్కనీలో ఉండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. బాల్కనీలో నుండి తాడు సాయంతో విండో క్లీనింగ్ ప్లాట్ఫాం కు చేరుకున్నాను. మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించి ఊపిరాడలేదు. 2016 సంవత్సరాన్ని చూడకుండానే మరణిస్తున్నాను అనుకున్నాను. అదృష్టవశాత్తు సహాయక సిబ్బంది సకాలంలో వచ్చి ప్రాణాలను రక్షించారు. అక్కడ ఉన్న తాడే నా ప్రాణాలను కాపాడింది' అని తెలిపాడు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.