కూలిన బెల్ హెలికాప్టర్: ఐదుగురి దుర్మరణం
సేవియర్ విల్లే: హెలికాప్టర్ లో సరదాగా విహరిద్దామనుకున్న నలుగురు టూరిస్టుల ప్రాణాలు గాలిలోకలిసిపోయాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో హెలికాప్టర్ కుప్పకూలిపోయి, పైలట్ సహా ఐదుగురు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం అమెరికాలో చోటుచేసుకుంది. ఫెడరల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి కేథలిన్ బెర్గన్ చెప్పిన వివరాల ప్రకారం..
టెన్నెస్సీ రాష్ట్రంలోని గ్రేట్ స్మోకీ పర్వతాల్లో గల జాతీయ పార్కుకు వెళ్లిన నలుగురు టూరిస్టులు హెలికాప్టర్ ద్వారా పరిసర ప్రాంతాలు విహరించేందుకు బయలుదేరారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హెలికాప్టర్ ఇంజన్ లో మంటలు చెలరేగాయి. పైలట్ హెలికాప్టర్ పై నియంత్రణ కోల్పోయాడు. కొద్ది క్షణాల పాటు గాలిలో చక్కర్లు కొట్టిన విహంగం.. విల్లే ప్రాంతంలో నివాస స్థలాలకు దగ్గరగా కూలిపోయింది.
సమాచారం అందిన వెంటనే ఆంబులెన్స్ లు, ఫైరింగజన్లతో ప్రమాద స్థలికి చేరుకున్నామని, దురదృష్టవశాత్తు హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నవారిలో ఎవ్వరూ బతకలేదని టెన్నెస్సీ ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ ప్రతినిధి డీన్ ఫ్లేజన్ చెప్పారు. నివాస స్థలాలకు కొద్దిగా దూరంగా కూలడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని, నేలపై ఉన్న ఎవరికీ గాయాలు కాలేదని, ఇళ్లకు కూడా నష్టం వాటిల్లలేదని తెలిపారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించి బంధువులకు కబురుపెడతామని పేర్కొన్నారు.