‘మా పార్లమెంటులో ట్రంప్ అస్సలొద్దు’
లండన్: తమ పార్లమెంటులో ప్రసంగించేందుకు తాము అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను అనుమతించబోమని, ఆయనకు స్వాగతం కూడా పలకబోమని బ్రిటన్ హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్ స్పష్టం చేశారు. తాము జాతి వివక్ష, లింగవివక్ష చూపేవారికి తాము పూర్తిగా విరుద్ధం అని అన్నారు. హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో మీడియాతో మాట్లాడుతూ ‘కామన్స్‌లో ప్రసంగించడాన్ని మేం చాలా గట్టిగా వ్యతిరేకిస్తాం. అలా ప్రసంగించడమనేది ఊరికే వచ్చే అవకాశం మాత్రం కాదు. గౌరవ ప్రదంగా మాత్రమే దాన్ని అందుకోగలగాలి.
ట్రంప్ వలసదారులపై నిషేధం విధించడానికి ముందే ట్రంప్ వెస్ట్ మినిస్టర్ హాల్‌లో ప్రసంగించడాన్ని వ్యక్తిగతంగా పూర్తిగా వ్యతిరేకించాను. ఇక ఆయన నిషేధం విధించిన తర్వాత గట్టిగా నా వ్యతిరేకతను సమర్థిస్తున్నాను. నాతోపాటే ఎంతో మంది కూడా.. అయితే, అమెరికాతో మాకున్న సంబంధాలను గౌరవిస్తాం. ఒక వేళ ఆయన దేశ పర్యటనకు వస్తే దానికి కావాల్సిన ఏర్పాట్లను ఒక స్పీకర్‌గా చేస్తాను’ అని చెప్పారు. ఇటీవలె తమ దేశానికి రావాలని బ్రిటన్ ప్రధాని థెరిసా మే ట్రంప్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే.