15 గంటలు గుండెను ఆపారు!
లండన్: బ్రిటన్‌లో గుండెలో పెద్ద రంధ్రంతో జన్మించిన నాథన్ బైర్న్ అనే శిశువుకు వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణంపోశారు. ఈ క్రమంలో శిశువు గుండెను 15 గంటల పాటు పనిచేయకుండా నిలిపివేశారు. అరుదైన రుగ్మత కారణంగా గుండెలో శ్వాసకోశ ధమని కుచించుకుపోతోంది. గుండె అతడి బొటనవేలి గోరు పరిమాణంలో ఉందని స్కాట్లండ్ వార్తాపత్రిక ‘డైలీ రికార్డ్’ పేర్కొంది. 7 గంటల్లో ఆపరేషన్ ముగుస్తుందని వైద్యులు భావించినా.. చివరికి రెట్టింపుకన్నా ఎక్కువ సమయం పట్టింది.
గుండెకు శస్త్రచికిత్స చేసేటపుడు గుండెను, ఊపిరితిత్తులను నిలిపివేశారు. కృత్రిమ యంత్రంతో రక్తం సరఫరా కొనసాగించారు. ఆపరేషన్ తర్వాత యంత్రాన్ని తొలగించాలని చూసిన ప్రతిసారీ.. గుండె, ఊపిరితిత్తులు పనిచేయలేదు. దీంతో యంత్రాన్ని అలా గే ఉంచారు. శస్త్రచికిత్స కారణంగా గుండె బాగా వాయటంతో.. శస్త్రచికిత్స కోసం తెరచిన బాలుడి ఛాతీని మూసివేయకుండా ఏడు రోజుల పాటు తెరచే ఉంచాల్సి వచ్చింది. మెదడులో రక్తం గడ్డకట్టి చాలాసార్లు 4-45 నిమిషాల పాటు గుండె ఆగిపోవ టం వంటి సమస్యలొచ్చాయి. ఇప్పుడతడి వయసు తొమ్మిది నెలలు. నవ్వుతూ చలాకీగా ఉన్న తమ బిడ్డను చూసిన ఎవరికైనా అతడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో ఎవరూ ఊహించలేరని అతడి తల్లి లెస్లీ కోండీ సంతోషంగా చెప్తున్నారు.