సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో పని చేసే పోలీసు అధికారులకు సర్వే ఫీవర్ పట్టుకుంది. ప్రభుత్వం 2014 ఆగస్టు 19న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే మాదిరిగా మరోసారి పోలీసు శాఖ ఆధ్వర్యంలో నేరస్తుల సమగ్ర సర్వేను ఈ నెల 18న నిర్వహించనున్నారు. ఈ మేరకు రెండు రోజుల నుంచి కమిషనరేట్ పరిధిలో పోలీసు స్టేషన్లలో ఫైళ్లకు పట్టిన దుమ్మును దులుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు చేపట్టనున్న సర్వే.. భవిష్యత్‌లో నేరాల సంఖ్యను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి 2017 డిసెంబర్ 31న జిల్లాలో పర్యటించిన సందర్భంగా పోలీసులకు దిశానిర్దేశనం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో అడిషనల్ సీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
వివరాల సేకరణ..
గతంలో హత్యలు, కిడ్నాప్‌లు, ఆయుధాలు, పేలుడు పదార్థాల అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడిన నేరస్తుల పూర్తి వివరాలను సేకరించడానికి ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ సకల నేరస్తుల సమగ్ర సర్వేను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్‌హెచ్‌ఓలు నేరస్తుల ఇళ్లకు వెళ్లి ఆధార్‌కార్డు, ఓటర్, రేషన్‌కార్డుల నంబర్లు, పాన్‌కార్డు, ఫేస్‌బుక్, ట్వీటర్ అకౌంట్ల వివరాలు, వేలిముద్రలు, ఇంటి నంబర్ సేకరించనున్నారు. నేరస్తుల కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలను కూడా తీసుకోనున్నారు. గతంలో పోలీస్ స్టేషన్లకు ఇచ్చిన ట్యాబుల ద్వారా ఫొటోలు తీస్తారు. ఇలా సేకరించిన వివరాలను పోలీసు శాఖకు ఉన్న డాటా బేస్ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినా.. దొంగతనానికి పాల్పడింది పాతవాళ్లు అయితే వెంటనే పట్టుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు.
నేర రహిత సమాజ నిర్మాణంలో భాగంగా..
నేరస్తుల సర్వే నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో 2008 జనవరి1 తరువాత నమోదైన వివిధ రకాల నేరాలకు సంబంధించి ఫైళ్లకు పట్టిన దుమ్మును దులిపే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అన్ని రకాల కేసుల వివరాలను ఈ నెల పదో తేదీలోపు కమిషనరేట్‌లో సమర్పించాల్సి ఉంది. దీంతో పాత ఫైళ్లను సైతం పోలీసులు మరోసారి తిరగేస్తున్నారు. ఆ తర్వాత నివేదికలను కమిషనరేట్‌కు పంపనున్నారు. నేర రహిత సమాజ నిర్మాణంలో భాగంగా డీజీపీ ఆలోచనల మేరకు ప్రతి కేసుకూ సంబంధించిన వివరాలు ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment