తమిళసినిమా: కాదేదీ కవితకు అనర్హత అన్నట్లుగానే, కాదెవరూ కథానాయకుడికి అనర్హులు అనవచ్చు. ఆఫీస్ బాయ్, కారు డ్రైవర్ ఇలా చాలా మంది అనూహ్యంగా సినిమాల్లో హీరోలైన సంఘటనలు ఉన్నాయి. అదే కోవలో నలభీమపాక నిపుణుడు చేరిపోయాడు. కుక్, జోకర్ వంటి ఆలోచింపజేసే, సామాజక స్పృహ ఉన్న చిత్రాలను తెరకెక్కించిన రాజుమురుగన్ కథ, మాటలతో మరో వైవిధ్య భరిత చిత్రం తెరకెక్కడానికి సిద్ధం అవుతోంది. దీనికి సవరణన్ రాజేంద్రన్ కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు.
ఈయన బాలుమహేంద్ర, కమలహాసన్, రాజుమురుగన్‌ల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. తొలిసారిగా మోగాఫోన్ పట్టనున్నారు. ఈ చిత్రం ద్వారా కోవైకి చెందిన మాదంపట్టి రంగరాజ్ కథానాయకుడిగా పరిచయం కానున్నారు. దీనిపై రాజుమురుగన్ తెలుపుతూ చిక్కని కథ, కథనం, మంచి నిర్మాత లభించినప్పటికీ హీరో కోసం చాలా మందిని చూసినా ఎవరూ సెట్ కాలేదన్నారు. అలా విసిగి వేసారిన తాను, దర్శకుడు సరవణన్ రాజేంద్రన్ కలిసి ఈ మధ్య స్నేహితుడి పెళ్లికి కోవై వెళ్లామన్నారు. అక్కడ వివాహ భోజనం కడు కమ్మగా ఉందన్నారు.
అంత కమ్మగా వండి వార్చిన వంట నిర్వాహకులెవరా? అని ఆరా తీయగా ఈయనే అంటూ వంట నిపుణుడు రంగరాజ్‌ను పరిచయం చేశారన్నారు. ఆయనతో మాట్లాడుతుండగా తమ కథలో నాయకుడి పాత్రకు ఈయన బాగుంటాడనిపించిందన్నారు. వెంటనే రంగరాజ్‌తో మీకు నటించాలనే ఆసక్తి ఉందా? అని అడిగామన్నారు. తను ముందు మోహమాటపడినా ఆ తరువాత అంగీకరించారని చెప్పారు. అలా రంగరాజ్ తమ చిత్రం ద్వారా హీరోగా మారనున్నారని చెప్పారు. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర కథ, మాటల రచయిత రాజుమురుగన్ తెలిపారు.