నా మీద సెటైర్లకు...నవ్వుకోవడానికి నేను రెడీ! | Allu Sirish and Aravind about IIFA Awards | Sakshi
Sakshi News home page

నా మీద సెటైర్లకు...నవ్వుకోవడానికి నేను రెడీ!

Published Wed, Jan 27 2016 10:52 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

నా మీద సెటైర్లకు...నవ్వుకోవడానికి నేను రెడీ!

నా మీద సెటైర్లకు...నవ్వుకోవడానికి నేను రెడీ!

 సెలబ్రిటీలపై సెటైర్లు వేయడం అంటే రిస్కే. హద్దులు దాటితే ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ లిమిట్ తెలుసుకుని జోక్ చేస్తే, అప్పుడు అందరూ హాయిగా నవ్వుకుంటారు. ‘ఐఫా’లో తెలుగు అవార్డుల ప్రదానోత్సవానికి హోస్ట్‌లుగా వ్యవహరించిన అల్లు శిరీష్, నవదీప్, రెజీనాలు వేసిన సెటైర్లు అలా అందర్నీ నవ్వించాయి. యాంకర్‌గా పొందిన అనుభూతిని అల్లు శిరీష్ పంచుకున్నారు. ముఖ్యాంశాలు..
 
♦  బాలీవుడ్ ‘ఐఫా’ అవార్డులు ప్రదానానికి నేను వెళ్లా. విద్యాబాలన్‌లా డ్రెస్ చేసుకుని షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ డ్యాన్స్, షాహిద్ కపూర్ చేసిన స్కిట్ చూసి, ‘మన తెలుగులో ఇలా ఎందుకు చేయడం లేదు?’ అనుకున్నా. ఎవరో ఒకరు ముందడుగు వేయాలని ‘ఐఫా-ఉత్సవం’కి యాంకర్‌గా చేశా.

♦  ‘విజ్ క్రాఫ్ట్’ ఆండ్రే నాకు మంచి స్నేహితుడు. యాంకర్‌గా చేస్తాననీ, నాకో మంచి కాంబినేషన్ ఉంటే బాగుంటుందనీ నవదీప్ పేరు సజెస్ట్ చేశా. మా ఇద్దరితో పాటు ఎవరైనా ఫిమేల్ స్టార్ ఉంటే రసవత్తరంగా ఉంటుందనుకుని, రెజీనాని అడిగితే ‘ఓకే’ చెప్పింది. స్క్రిప్ట్ మొత్తం దాదాపు నేనే అనుకున్నా. నేనేదీ ఆశించి చేయలేదు కానీ, నాకు చెక్ పంపించారు. ‘ఎందుకు?’ అనడిగితే ‘ఫ్రెండ్‌షిప్ వేరు.. ఇది వేరు’ అన్నారు.
 
♦  సెలబ్రిటీల మీద సెటైర్లు వేయడం అంటే వాళ్లను నవ్వించాలి తప్ప హద్దులు దాటకూడదు. నాకు అందరితోనూ పరిచయం ఉండటం, కొందరితో చనువు ఉండటంతో ఎవరెవరు ఏయే విషయాలపై సెటైర్ వేస్తే, ఫీలవుతారో తెలుసు. ‘మీ గురించి ఇలా అనాలనుకుంటున్నాం’ అని చెప్పి, చేశాం. కానీ, ‘వెంకీ ఫోన్ నంబర్ ఇస్తారు?’ అని మేమంటే ‘ఏరా.. మీకైతే చాలా నంబర్లు ఉంటాయి.. నాకున్నది ఒక్క నంబరేరా’ అని వెంకటేశ్ గారు వేదికపై అనడం స్పాంటేనియస్‌గా వచ్చింది. ఇలా అప్పటికప్పుడు వచ్చినవీ ఉన్నాయి.
 
మా మామయ్య (చిరంజీవి) ‘బాగా చేశావ్.. సరదాగా మాట్లాడావ్’ అని మెసేజ్ పెట్టారు. నాన్నగారు (అల్లు అరవింద్) కూడా అభినందించారు. రవితేజ అయితే, తన స్టైల్‌లో ‘బాగా చేశావ్ అబ్బాయి’ అన్నారు. చాలామంది దర్శక-నిర్మాతలూ ప్రశంసించారు.
 
  సినిమాల్లో ఏ పాత్ర చేస్తే, అందుకు తగ్గట్టుగానే నటించాలి. ఇక్కడ అలా కాదు.. ఎంతైనా రెచ్చిపోవచ్చు. వ్యాఖ్యాతగా చేయడం ద్వారా నాకు మంచి టైమింగ్ ఉన్న విషయం, నేను బాగా మిమిక్రీ చేయగలననే విషయం అందరికీ తెలిసింది. సో... ఈ వేడుక వల్ల నాకు సినిమా అవకాశాలు పెరుగుతాయనే ఫీలింగ్ చేసిన తర్వాత కలిగింది (నవ్వుతూ..).
 
  తెలుగు పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పుడు సినిమా ప్రీమియర్స్ వేసి, అందర్నీ పిలిచేవాళ్లు. చిరంజీవిగారి సినిమాలకు మిగతావాళ్లు వచ్చేవాళ్లు. బాలకృష్ణగారి ‘నరసింహనాయుడు’ సినిమా వేసినప్పుడు మేం వెళ్లాం. అలా ఆ తరం వాళ్లు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లు. ఇప్పుడు మా జనరేషన్ అంతా కూల్‌గానే ఉంటున్నాం.
 
♦  నాకు తెలిసి మేం వేసిన పంచ్‌లు ఎవర్నీ హర్ట్ చేయలేదు. శ్రుతీహాసన్‌ని ‘ఫాదర్ స్టార్’ అనీ, ఫాదర్ వల్లే పైకి వచ్చిందనీ నవదీప్ అంటే, ‘ఏయ్.. అలా అంటావేంటి? తన టాలెంట్‌తో పైకొచ్చింది’ అంటాను. సో.. శ్రుతి హర్ట్ అవ్వలేదనే అనుకుంటున్నాను. నాతో తను బాగుంటుంది. బన్నీ (అల్లు అర్జున్)తో యాక్ట్ చేస్తోంది కాబట్టి, నన్ను చిన్నపిల్లాడు అనుకుంటుందేమో.. ‘స్వీటీ’ అని పిలుస్తుంటుంది.
 
  ఈ వేడుకలో లాగా రేపు నా మీద ఎవరైనా అలా వేసినా సరదాగా తీసుకుంటా. సరదాగా ఒకరి మీద ఒకరు వేసుకునే జోక్స్ అనుబంధాన్ని పెంచుతాయని నా నమ్మకం. ఓవరాల్‌గా ‘ఐఫా’ నాకు మంచి అనుభూతిని మిగిల్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement