నన్ను అర్థం చేసుకునేవాడైతే ఓకే
నేను మనువాడే వాడు మంచి మనసున్నవాడై ఉండాలి,నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి అంటున్నారు నటి కాజల్‌అగర్వాల్. ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో వెలిగిన ఈ ఉత్తరాది బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్‌పై దృష్టి పెట్టారు.తొలుత బొమ్మలాటం చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా పరిచయం చేసిన నటి కాజల్. ఆ తరువాత పళని,నాన్ మహాన్‌అల్ల,తుపాకీ, జిల్లా తదితర చిత్రాల్లో నటించారు. అయితే తొలి చిత్రం నిరాశ పరచడంతో మదనపడిన ఈ బ్యూటీకి టోలీవుడ్‌లో చందమామ లాంటి అవకాశం ఆదుకుంది.
ఆపై మగధీర స్టార్‌డమ్‌ను అందించడంతో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. అలాగే కోలీవుడ్‌లో మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న కాజల్‌కు తుపాకీ బాగా పేలింది. వెంటనే విజయ్‌తో జిల్లా చిత్రంలో లక్కీచాన్స్ రావడంతో హిట్ హీరోయిన్ అయ్యిపోయింది.ప్రస్తుతం కోలీవుడ్‌పైనే దృష్టి సారిస్తున్న ఈ సుందరి ధనుష్ సరసన మారీ విశాల్‌కు జంటగా పాయుంపులి చిత్రాల్లో నటిస్తున్నారు.త్వరలో విక్రమ్‌లో జోడీ కట్టడానికి సిద్ధం అవుతున్న కాజల్ మారీ చిత్ర ప్రచారంలో భాగంగా బుధవారం చెన్నైలో విలేకరులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఈ బ్యూటీతో చిన్న భేటీ
ప్రశ్న: మారీ చిత్రంలో నటించిన అనుభవం గురించి?
జవాబు: ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. దనుష్‌తో నటించడం మంచి అనుభం. అదేవిధంగా దర్శకుడు బాలాజీమోహన్ తో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంది. మారీ జనరంజికమైన కమర్శియల్ చిత్రం.
ప్రశ్న: చిత్రంలో మీ పాత్ర?
జవాబు: ఫ్యాషన్ డిజైనర్‌గా నటిస్తున్నాను.
ప్రశ్న: తమిళ చిత్రాలలో నటిస్తున్నా తమిళంలో మాట్లాడలేకపోతున్నారే?
జవాబు: ఇప్పుడిప్పుడే తమిళ భాష నేర్చుకుంటున్నాను.
ప్రశ్న: పారితోషికం రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారట?
జవాబు: అందంతా అవాస్తవం. నా అర్హతకు తగ్గ పారితోషికమే పొందుతున్నాను.
ప్రశ్న: హీరోలకు విందు ఇచ్చి అవకాశాలు దక్కించుకుంటున్నారన్న ప్రచారానికి మీ బదులు?
జవాబు: నేనేవరికీ విందులు ఇవ్వలేదు. అదంతా అసత్యప్రచారమే,అయినా అవకాశాల కోసం ఎవరైనా పార్టీలు ఇస్తారా?
ప్రశ్న: మీకు నచ్చిన హీరో?
జవాబు; రజనీకాంత్
ప్రశ్న: మీలాంటి యువ నటి ఐశ్వర్య కాక్కముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ప్రశంసలు అందుకుంటున్నారు. మీరు అలా ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తారా?
జవాబు: అలాంటి పాత్ర లభిస్తే తప్పకుండా నటిస్తా.
ప్రశ్న: ప్రేమ,పెళ్లి గురించి?
జవాబు: ప్రస్తుతం ప్రేమించడానికి సమయం లేదు. ఇక పెళ్లి ఆలోచన ఏం ఉంటుంది?
ప్రశ్న: ఎలాంటి భర్త కావాలని కోరుకుంటారు?
జవాబు: నాకు తెలియదు. ఎందుకంటే అలాంటి వారెవర్నీ నేను కలుసుకోలేదు. అయినా చెప్పాలంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరుకు చెందిన వారైనా పర్వాలేదు. ఎలాంటి నిబంధనలు పెట్టను.అయితే తను నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి. చాలా నిజాయితీగా ఉండాలి.