అంతా కొత్త వాళ్లతో సినిమా!
హిందీ ‘దేవదాసు’ గురించి చర్చలు
‘‘సినిమా అంటే నాకు చాలా ప్యాషన్. కథ తయారు చేయడం మొదలుపెట్టినప్పట్నుంచీ సినిమా పూర్తయ్యేవరకూ నాకు వేరే ఆలోచనే ఉండదు’’ అని దర్శకుడు వైవీయస్ చౌదరి అన్నారు. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్‌గా దూసుకెళుతున్న రామ్‌లో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడనీ, ఆల్రెడీ ఒక దర్శకుడు రిజెక్ట్ చేసిన ఇలియానాలో మంచి హీరోయిన్ మెటీరియల్ ఉందని నమ్మి, ఇద్దర్నీ ‘దేవదాసు’ చిత్రం ద్వారా నాయకా నాయికలుగా పరిచయం చేశారాయన. అలాగే, నందమూరి హరికృష్ణ హీరోగా చేస్తారని ఎవరూ ఊహించలేదు.
ఆయన టైటిల్ రోల్‌లో ‘సీతయ్య’ తీశారు వైవీయస్. అంతకుముందు భారీ తారాగణంతో తీసిన ‘లాహిరి లాహిరి’ చిత్రంలో హరికృష్ణతో ప్రధాన పాత్ర చేయించడంతో పాటు, ఆయన, నాగార్జున కాంబినేషన్‌లో ‘సీతారామరాజు’ తీశారు. సుప్రీమ్ హీరోగా మాస్‌లో మంచి పేరు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్‌ను గుర్తించింది కూడా వైవీయస్సే. ‘‘ఓ దర్శకుడిగా ఎదుటి వ్యక్తి బాడీ లాంగ్వేజ్, ప్రవర్తనను బట్టి వాళ్లు ఆర్టిస్టులుగా పనికొస్తారా? లేదా? అని ఆలోచించుకుంటాను. పనికొస్తారనిపిస్తే పరిచయం చేస్తాను.
ఇప్పుడు కూడా కొత్తవాళ్లతో సినిమా ప్లాన్ చేస్తున్నాను’’ అని వైవీయస్ అన్నారు. బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీయస్ సంగీత ప్రధానంగా సాగే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తీశారు. నేడు ఆయన బర్త్‌డే. భవిష్యత్ ప్రణాళికల గురించి వైవీయస్ చెబుతూ - ‘‘కొత్తవాళ్లతో తీయబోతున్న చిత్రానికి కథ- స్క్రీన్‌ప్లే సమకూర్చి, దర్శకత్వం వహించడంతో పాటు నేనే నిర్మిస్తా. ‘దేవదాసు’ చిత్రం హిందీ రీమేక్ హక్కులను ఓ ప్రముఖ నిర్మాత అడిగారు. నన్నే దర్శకత్వం వహించమన్నారు. నాకు హిందీ చిత్రాలంటే ఇష్టం ఉన్నప్పటికీ తెలుగు చిత్రం ప్లాన్‌లో ఉండటంతో హిందీ రీమేక్‌కి ఇంకా మాటివ్వలేదు’’ అన్నారు.