'నేను కమెడియన్ ను కాను'
ముంబై: తనను అందరూ కమెడియన్ గానే భావించడాన్ని బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ తట్టుకోలేక పోతున్నాడు. అతడు హాస్యప్రధాన పాత్రలతో పాటు సీరియస్ క్యారెక్టర్లలో కూడా నటించినప్పటికీ అతనిపై కమెడియన్ ముద్ర అలాగే ఉండిపోయింది. తన శైలికి భిన్నంగా అతడు 'డర్నా మర్నా హై', 'డర్నా జరూరీ హై', 'మై మాదురీ దీక్షిత్ బన్నా చాహ్తీ హూ' తదితర చిత్రాలలో సీరియస్ పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. 15 ఏళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న రాజ్పాల్ సూమారు 500 మూవీలలో నటించాడు.
రాజ్పాల్ తన తదుపరి చిత్రం 'తోడా లుట్స్ తోడా ఇష్క్' ట్రైలర్ లాంచ్ చేసే కార్యక్రమంలో విలేకరులకు ఓ విషయాన్ని గుర్తుచేశారు. గత పదేళ్లుగా కమెడియన్ అనే ముద్రను పోగోట్టుకోవడానికి పోరాడుతున్నట్లు చెప్పాడు. కమెడియన్ కావాలని తానెప్పుడూ కోరుకోలేదని, కమెడియన్ అనే టాగ్ తనకు ఇష్టం ఉండదని తెలిపాడు. ప్రేక్షకులను అలరించడం మాత్రమే తన పని అని, నటులను ఆయా కేటగరీల కింద వేరుచేయడం తనను బాధకు గురిచేస్తుందన్నాడు. నచ్చిన సినిమాలను చేశానని, ఇష్టం లేని మూవీలను తిరస్కరించానని రాజ్పాల్ యాదవ్ చెప్పుకొచ్చాడు.