నాలుగు భాషల్లో బిజీ బిజీగా...! | Jagapathi Babu In Pulimurugan Malayalam Movie | Sakshi
Sakshi News home page

నాలుగు భాషల్లో బిజీ బిజీగా...!

Published Sun, Mar 13 2016 10:27 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

నాలుగు భాషల్లో బిజీ బిజీగా...!

నాలుగు భాషల్లో బిజీ బిజీగా...!

పాజిటివ్, నెగటివ్ షేడ్స్ ఉన్న స్టైలిష్ క్యారెక్టర్స్ చేస్తూ, దూసుకెళుతున్నారు జగపతిబాబు. లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో చిత్రాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పాత్రలు చేసిన ఈ వెర్సటైల్‌ఆర్టిస్ట్ ఈ ఏడాది మలయాళ పరిశ్రమకు పరిచయం కానున్నారు. మోహన్‌లాల్ హీరోగా రూపొందుతున్న ‘పులి మురుగన్’లో విలన్‌గా చేస్తున్నారు. అలాగే, కన్నడంలో ‘జాగ్వార్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సీబీఐ ఆఫీసర్‌గా పాజిటివ్ రోల్ చేస్తున్నారు. తమిళ హీరో విజయ్ నటించనున్న ఓ చిత్రంలో విలన్‌గా నటించడానికి అంగీకరించారు. కొన్ని తెలుగు చిత్రాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం చేతిలో ఉన్న ‘పులి మురుగన్’ సినిమా ఇప్పటివరకూ మోహన్‌లాల్ నటించిన చిత్రాల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమనీ, కన్నడ ‘జాగ్వార్’ కూడా పెద్ద బడ్జెట్ సినిమానే అనీ జగపతిబాబు అన్నారు. ఇక, విజయ్ సినిమా అంగీకరించడానికి కారణం అది ప్రఖ్యాత విజయా ప్రొడక్షన్స్ నిర్మించనుండటమే అని ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారాయన. ఇంకా జగపతిబాబు మాట్లాడుతూ - ‘‘విజయా సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణిగార్లతో మా నాన్నగారు వీబీ రాజేంద్రప్రసాద్‌కి మంచి అనుబంధం ఉండేది. నాగిరెడ్డిగారి అబ్బాయి వెంకటరామిరెడ్డి ఈ సంస్థపై తీస్తున్న సినిమాలో నటించనుండటం ఆనందంగా ఉంది.

పైగా హీరోగా నా మొదటి సినిమా (‘సింహస్వప్నం’) షూటింగ్ ఆరంభమైంది వాహినీ స్టూడియోలోనే. ఆ రోజు తెలుగు, తమిళ పరిశ్రమలకు సంబంధించిన పలువురు ప్రముఖులు వచ్చి, ‘మంచి హీరో అవుతావు’ అని నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడీ సంస్థలో సినిమా ఒప్పుకున్న సందర్భంగా ఆ రోజు గుర్తొస్తోంది’’ అన్నారు. అంతా బాగానే ఉంది.. అన్నీ పెద్ద బడ్జెట్ చిత్రాలే చేస్తున్నారు? చిన్న చిత్రాలు చేయరా? అనే ప్రశ్న జగపతిబాబు ముందుంచితే - ‘‘చిన్న చిత్రాలకు నేనెప్పుడూ వ్యతిరేకం కాదు. నాకు పాత్ర ముఖ్యం. మంచి పాత్ర అయితే చిన్న చిత్రాలు కూడా చేస్తా’’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారీ పారితోషికం తీసుకుంటున్నారట.. మరి చిన్న చిత్రాలకు వెసులుబాటు ఇస్తారా? అనడిగితే - ‘‘వై నాట్. నాకు డబ్బు ముఖ్యం కాదు. నటుడిగా సంతృప్తినిస్తే చేస్తా’’ అన్నారు జగపతిబాబు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement