ఆ నలుగురిదే హవా
ఎవరికైనా లక్ లేదా కిక్ ఉంటేనే మజా ఉంటుంది.మరి ఈ రెండూ ఉంటే ఆ క్రేజే వేరే.ప్రస్తుతం పరువపు తారలు నయనతార,అనుష్క,త్రిష, కాజల్‌అగర్వాల్ మొదలగు నలుగురు వృత్తి పరంగా అలాంటి జోష్‌లోనే ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా కథానాయికల పరిధి పరిమితం అంటుంటారు.18, 20 ఏళ్ల వయసులో నటీమణులు సినీ రంగప్రవేశం చేస్తుంటారు. వాళ్లలో చాలా మందికి నటిగా నిలదొక్కుకోవడానికే చాలా కాలం పడుతుంది. ఆ తరువాత విజయం వరించినా ఓ ఐదారేళ్లు దాన్ని నిలబెట్టుకోగలుగుతారు. అప్పటికి 25 ఏళ్ల వయసు మీద పడుతుంది. ఈలోగా కొత్తవాళ్లు రెడీ అవుతుంటారు.
దీంతో సీనియర్లు కొందరు తెరమరుగవడం, మరి కొందరు అక్క, వదిన లాంటి పాత్రకు పరిమితం అవడం జరుగుతుంటుంది. అదీ దాటి 30 ఏళ్ల వరకూ హీరోయిన్లుగా నిలబడగలిగారంటే వారిది పెద్ద సాధనే అవుతుంది. 30 దాటినా కథానాయికలుగా మన్ననలు పొందుతున్నారంటే కచ్చితంగా వారు అదృష్టవంతులే. అలాంటి లక్కే మూడు పదులు దాటినా ముద్దుగుమ్మలు నయనతార,అనుష్క,త్రిష, కాజల్‌అగర్వాల్‌లను ఇప్పటికీ అగ్ర నాయికలుగా నిలబెట్టింది. వీరు వ్యక్తిగత ఒడిదుడుకులకు లోనైనా ఆ ప్రభావాన్ని కెరీర్‌పై చూపలేదంటే అదీ అదృష్టమే.
అనుష్క కోసమే కథలు
ఇక యోగా టీచర్ అనుష్క గురించి చెప్పాలంటే తన కోసమే కథలు రాసే స్థాయికి చేరుకున్నారు.అరుంధతి చిత్రంలో అభినయంతో ఆడుకున్న అనుష్క ఫెరోషియస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. చారిత్రక కథా చిత్రాల్లో నటించాలంటే అనుష్కనే అన్నంతగా పేరు తెచుచకున్నారు. గత ఏడాది బాహుబలి, రుద్రమదేవి వంటి చారిత్రక కథా చిత్రాలతో పాటు ఇంజి ఇడుప్పళగి చిత్రంలో నటించారు. విశేషం ఏమిటంటే ఈ మూడూ ద్విభాషా చిత్రాలే. బాహుబలి,రుద్రమదేవి చిత్రాలు 100 కోట్ల క్లబ్‌లో చేరడం మరో విశేషం.34 ఏళ్ల ఈ పరువాల గుమ్మ ప్రస్తుతం బాహుబలి-2,ఎస్-3 చిత్రాలలో నటిస్తూ మేటి నటిగా తన స్థానాన్ని పదిల పరుచుకుంటున్నారు.
కాజల్ లక్కీనే
నటి కాజల్‌అగర్వాల్‌ను అదృష్టం విడనాడలేదు. మధ్యలో కాస్త తడబడినా మళ్లీ గాడిలో పడ్డారు. తెలుగు చిత్రం మగధీర ఈమెను ప్రముఖ నటీమణుల జాబితాలో చేర్చింది. అప్పటి నుంచి తన స్థానాన్ని పదిలపరచుకుంటూ వస్తోంది. కాజల్ వయసు 30 దాటింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలోనూ ఐదు చిత్రాలు ఉన్నాయి. తమిళంలో జీవా సరసన కవలై వేండామ్,విక్రమ్‌తో గరుడ,తదితర చిత్రాలతో పాటు తెలుగులో మహేశ్‌బాబుకు జంటగా బ్రహ్మోత్సవం,పవన్‌కల్యాణ్‌తో సర్ధార్ గబ్బర్‌సింగ్, హిందీలో ఒక చిత్రం అంటూ మయ బిజీగా ఉన్నారు కాజల్‌అగర్వాల్. స్టార్ హీరోలు వర్ధమాన నాయకులతో నటించడానికి ఇష్ట పడకపోవడంతో ఈ సీనియర్ హీరోయిన్లు ఇంకా రాణించడానికి ఒక కారణం అని భావించవచ్చంటున్నారు సినీపండితులు.
ఎవర్‌గ్రీన్ త్రిష
నటి త్రిష కూడా మూడు పదుల వయసును మీదేసుకున్న నటే.అయితే నటిగా ప్రారంభ దశలో ఎలా ఉన్నారో అంతే వన్నె తగ్గని అందాలతో నేటికీ విరాజిల్లుతూ ఎవర్‌గ్రీన్ నాయకిగా వెలుగొందుతున్నారు. ఈ చెన్నై చిన్నదాని క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అవకాశాలు వ స్తూనే ఉన్నాయి. త్రిష ప్రస్తుతం నాయకి అనే ద్విభాషా చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
అగ్రస్థానం నయనదే
మూడు పదుల వయసు. రెండు సార్లు ప్రేమలో విఫలం. సినిమాలకు ఏడాదికి పైగా దూరం. హీరోయిన్‌గా రీఎంట్రీ. అయినా అగ్ర స్థానం మలయాళీ భామ నయనతారదే. చేతినిండా చిత్రాలు. మూడు కోట్ల వరకూ పారితోషికం ఎదగడమే కానీ తరగని క్రేజ్.స్టార్ హీరోల నుంచీ యువ హీరోల వరకూ జత కట్టాలని కోరుకుంటున్నారు.ఇదీ నయన్ హవా.ఇది తమిళంతో పాటు తెలుగులోనూ కొనసాగుతుండటం గమనార్హం. ఈ ఏడాది జీవాతో తిరునాళ్,శింబుతో ఇదునమ్మఆళు,కార్తీకి జంటగా కాస్మోరా,విక్రమ్ సరసన ఇరుముగన్ అంటూ చేతి నిండా చిత్రాలు ఉన్నాయి.వీటితో పాటు తెలుగులో వెంకటేశ్‌తో ఒక చిత్రం చేస్తున్నారు.చిరంజీవి సరసన కూడా నటించనున్నట్లు ప్రచారంలో ఉంది.