![105 ఏళ్ళ బామ్మ.. మేకలు అమ్మి... - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/51473826537_625x300.jpg.webp?itok=vDg6nwx-)
105 ఏళ్ళ బామ్మ.. మేకలు అమ్మి...
న్యూఢిల్లీః పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశ పెట్టిన స్వచ్ఛభారత్ అభియాన్.. ఆ వృద్ధురాలిని మెస్మరైజ్ చేసింది. 105 ఏళ్ళ వయసులో ఆమె.. తన మేకలను అమ్మకానికి పెట్టి మరీ ఇంట్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టింది. అంతేకాక పరిసర గ్రామాల్లోని ప్రజలకు ఇంట్లో మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. దీంతో కున్వర్ బాయ్ ని ఈ నెల సెప్టెంబర్ 17న నిర్వహించే స్వచ్ఛతా దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రత్యేకంగా సత్కరించనున్నారు.
గత ఫిబ్రవరి నెలలో ఛత్తీస్ గఢ్ లోని రాజనందగ్రామంలో నిర్వహించిన ర్యాలీ సందర్భంలో ప్రధాని.. ఆ శతాధిక వృద్ధురాలైన కున్వర్ బాయ్ కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఛత్తీస్ గఢ్ లో ని ధమ్ తరి కోటభర్రి గ్రామంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ (రూరల్-అర్బన్) మిషన్ ప్రారంభోత్సవ సందర్భంలో కున్వర్ బాయ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపిన ప్రధాని.. ఆపై ఆమె ఆశీర్వాదాన్ని పొందారు.