ఆరడుగుల ఎత్తున్నవారికి మాత్రమే..!
తిరువనంతపురం: ఆరడగుల అందగాడు.. ఆరడుగుల బుల్లెట్. ఇలా ఆరడుగుల ఎత్తు అనేది కొంచెం ప్రత్యేకంగా నిలుస్తుందని వేరే చెప్పక్కర్లేదు. 5.5 అడుగులు.. సరాసరి ఎత్తుగా కలిగిన ఇండియాలో ఆరడుగుల ఎత్తు అంటే అందరికీ మోజే. కొందరైతే ఈ బెంచ్మార్క్ను చేరుకోవడానికి ఎత్తు పెరిగే శస్త్ర చికిత్సలకు సైతం వెనుకాడకపోవటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆరడుగులకు పైబడి ఎత్తు ఉన్నవారికి.. ఆ ఎత్తే కొన్నిసార్లు సమస్యగా మారుతుంది కూడా.
మామూలు కార్లో కూర్చోవాలంటే వారు వంగటం కొంచెం కష్టమే. అంతే కాదు చెప్పుల షాపుకు వెళ్తే.. ఆ పాదాల సైజుకు సరిపడే చెప్పులు కూడా అన్ని సార్లు దొరకవు. ఇలాంటి ఆరడుగులు, ఆ పైన ఎత్తు ఉన్న వారికోసం కేరళలో ఓ అసోసియేషన్ ఏర్పాటైంది. కేరళ టాల్ మెన్ అసోసియేషన్(కేటీఎంఏ)గా పిలువబడుతున్న దీనిలో సభ్యులు కావాలంటే ఎత్తు ఆరడుగులకు పైగా ఉండాల్సిందే. ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరిలో 70 మంది మహిళలు సైతం ఉన్నారు. రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ సకారియా జోసెఫ్ కేటీఎమ్ఏను 1999లో ప్రారంభించారు.
బట్టలు, చెప్పుల సైజు విషయంలో వీరికి సాధారణంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవటంతో పాటు.. దీనిలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాన్ని సైతం ఈ అసోసియేషన్ కల్పిస్తుంది. పర్సనల్ సెక్యురిటీ, భద్రతకు సంబంధించిన ఉద్యోగాల్లో వీరి ఎత్తుకు మంచి ప్రాధాన్యత లభిస్తోంది. వీరి ఎత్తుకు తగిన పెళ్లి సంబంధాలను కలుపడంలో సైతం కేటీఎంఏ కృషి చేస్తుంది. 6.3 అడుగుల ఎత్తుతో కేటీఎంఏలో సభ్యురాలిగా ఉన్న కవిత మాట్లాడుతూ.. 'బయటకు వెళ్లినప్పుడు చిన్న పిల్లలు, యువత ఆశ్చర్యంతో చూసేవారు. అది కొంత ఇబ్బందిగా ఉండటంతో పబ్లిక్ ప్లేస్లకు వెళ్లడం తగ్గించేదాన్ని. అయితే ఈ అసోసియేషన్లో చేరిన తరువాత నాలాంటి వాళ్లను చాలా మందిని కలువగలిగాను. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది' అని తెలిపింది. ఎక్కువ ఎత్తుతో ఉన్నామని డిప్రెస్ అయ్యేవారికి కేటీఎమ్ఏ సహకారం అందిస్తుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆంటోని తెలిపారు.