న్యూఢిల్లీ : బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌పై బిజెపి సోమవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసం ముందు, ఎఐసిసి కార్యాలయం ఎదుట భారీ ప్రదర్శన చేపట్టింది. వందలాది బిజెపి కార్యకర్తలు సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఢిల్లీలో 2008లో జరిగిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్ లో తప్పించుకున్న ఉగ్రవాది మొహమ్మద్ సాజిద్ అలియాస్ బడా సాజిత్ ఇటీవల ఇస్లామిక్ స్టేట్ విడుదల చేసిన వీడియోలో కనిపించాడు.
ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం ఐఎస్ఐఎస్ విడుదల చేసిన 22 నిముషాల వీడియోలో కనిపించిన ఇద్దరిలో ఒకరు సాజిద్. అయితే ఎన్‌కౌంటర్‌కు కొద్ది ముందు అక్కడి నుండి తాను పారిపోయానంటూ అతడు ఆ వీడియోలో చెప్పడంతో మరోసారి బాట్లా ఎన్ కౌంటర్ తెర మీదకు వచ్చింది. ఆ ఎన్కౌంటర్ నిజమని నాటి హోంమంత్రి చిదంబరం స్పష్టత ఇస్తే, మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ భిన్న వైఖరిని వ్యక్తం చేశారు. దమ్ముంటే బీజేపీ తాజాగా విచారణ జరిపి అసలు నిజాలను వెలికి తీయాలని, లేదంటే జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.