ప్రభుత్వం చేయలేని పనిని పట్టుదలతో ఆ బీహారి మహిళలు చేశారు. కనీస సౌకర్యం కోసం చెమట్లు చిందించి ఎంతటి కష్టాన్నయినా పడతామని నిరూపించారు. బీహార్‌లోని బాంకా జిల్లాలో మారుమూల గ్రామమైన నిమాకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. దీంతో 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న పంచాయితీ కార్యాలయానికి కూడా వాళ్లు వెళ్లలేకపోతున్నారు. ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలన్నా చుక్కలు కనిపిస్తున్నాయి. ఆస్పత్రికి సరైన సమయానికి చేరుకోలేక ఎందరో గర్భిణులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే వారికి నరకమే.. ఊరులోనే బందీలుగా మారిపోవాల్సిన దుర్భర పరిస్థితి. ప్రభుత్వమే రోడ్డు వేస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు.
మూడు నాలుగేళ్ల క్రితం నిమా ఊరికి రోడ్డు వెయ్యాలని ప్రభుత్వం కూడా భావించింది కానీ భూ సేకరణ సమస్యతో ఆ పని చెయ్యలేకపోయింది. తమ ఆశలు అడియాసలు కావడంతో 130 మంది వరకు మహిళలు ఒక బృందంగా ఏర్పడి తామే రోడ్డు వెయ్యాలన్న కొంగులు బిగించారు. రహదారికి అవసరమైన భూమి సేకరణ కోసం భూ యజమానుల్ని కలిశారు. తాము పడుతున్న కష్టాలను ఓపికతో వివరించారు. రోడ్డు ఎలాగైనా వెయ్యాలని మహిళల్లో ఉన్న తపన చూసిన ఆ భూ యజమానుల్లో కూడా మార్పు వచ్చింది. భూమి కేటాయించడానికి అంగీకరించారు. ‘ ఆ గ్రామస్తులు పడుతున్న బాధని అర్థం చేసుకున్నాం. ఆ మహిళల్లో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూసి భూమి ఇవ్వడానికి అంగీకరించాం‘ అని అర్జున్ మంఝి అనే భూ యజమాని చెప్పారు.
ఒక్కసారి భూమి రాగానే మహిళల్లో శక్తి సామర్థ్యాలన్నీ బయటకొచ్చాయి. తామే స్వయంగా ఇసుక, మట్టి, రాళ్లు ఎత్తి మరీ మూడు రోజుల్లోనే రెండు కిలో మీటర్ల రోడ్డు వేశారు. ‘రోడ్డు నిర్మాణం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆపకుండా పనిచేశాం. మా ఇంట్లో మగవాళ్లు కూడా కొంత సాయం చేశారు. ఆతర్వాత దగ్గర్లో ఉన్న నది నుంచి ఇసుక, రాళ్లు వంటివి తీసుకొచ్చి మేమే రోడ్డు పోశాం. ఇప్పడు చిన్న చిన్న వాహనాలు ఈరోడ్డుపై ప్రయాణించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు‘అని ఉషాదేవి అనే మహిళ చెప్పారు. పట్టుదల ఉంటే సాధించలేనిదేదీ లేదని చాటి చెప్పిన ఆ మహిళల కృషిని అందరూ కీర్తిస్తున్నారు. బాంకా జిల్లా మెజిస్ట్రేట్ కుందన్‌కుమార్ మహిళల్ని స్వయంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment