అసెంబ్లీలో ఆ వీడియో చూసి బుక్కైన ఎమ్మెల్యే
Published Tue, Dec 15 2015 12:37 PM | Last Updated on Mon, Mar 18 2019 8:57 PM
భువనేశ్వర్: మొన్న కర్ణాటకలో, నేడు ఒడిశాలో సాక్షాత్తూ అసెంబ్లీ సమావేశాల్లోనే అశ్లీల వీడియోలను వీక్షించడం కలకలం రేపింది. వివాదం రేపిన ఈ ఘటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్డంగా బుక్కయ్యాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నబా కిశోర్ దాస్ ను అసెంబ్లీ సమావేశాల నుంచి మంగళవారం సస్పెండ్ చేశారు. మొబైల్ ఫోన్లో పోర్న్ వీడియోను చూశారన్న ఆరోపణలపై ఆయనను ఏడు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిరంజన్ పూజారి ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటుగా సమగ్ర విచారణ నిమిత్తం ఈ అంశాన్ని నిపుణుల కమిటీకి నివేదించారు.
అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్వాకాన్ని బీజేడీ ఎమ్మెల్యే ప్రమిలా మాలిక్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. దేవాలయంలాంటి అసెంబ్లీలో ఇలాంటి నీచపు పనులు సరైనవి కాదని విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రతిష్టకు భంగం కలిగించే ఈ చర్యలను సహించకూడదని, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదుపై స్పీకర్ స్పందించారు.
అయితే నబా కిశోర్ దాస్ అసెంబ్లీలో అభ్యంతకర వీడియోను చూస్తున్న దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో వివాదం రేగింది.
అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖండించారు. తనను కావాలనే ఇరికించారంటున్నారు. తన సోషల్ మీడియా అకౌంట్ను పరిశీలిస్తుండగా పొరపాటున ఆ వీడియో ఓపెన్ అయిందంటున్నారు. ఇందులో తన తప్పేమీ లేదనీ, ఉద్దేశ పూర్వకంగా చేసిందేమీ లేదని వాదిస్తున్నారు. విచారణలో అన్ని విషాయలు నిగ్గు తేలతాయన్నారు.
కాగా చట్టసభల్లో ప్రజాప్రతినిధులు అశ్లీల వీడియోలను వీక్షించడం ఇదే మొదటిసారి కాదు. 2012 లో కర్ణాటక అసెంబ్లీలో సాక్షాత్తు ఇద్దరు మంత్రులు పోర్న్ వీడియోలు చూస్తూ మీడియాకు చిక్కారు.
Advertisement