శివమొగ్గ (కర్ణాటక) : కూతురి పాలిట కామపిశాచిగా మారిన ఓ తండ్రి.. ఆమెను బంధించి అత్యాచారం సాగించాడు. అంతటితో ఆగకుండా గర్భం దాల్చిన ఆమెకు నెలలు నిండిన తర్వాత తానే పురుడుపోసి రక్తపు మడుగులో నిర్ధాక్షిణ్యంగా వదిలి పనికి వెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే... కర్ణాటకలోని కార్కలకు చెందిన కెంప(45)కు భార్య, ముగ్గురు బిడ్డలు ఉన్నారు. దంపతుల మధ్య గొడవల కారణంగా భర్తను విడిచి కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకుని భార్య వెళ్లిపోయింది. తన వద్ద ఉన్న కుమార్తె(16)తో కలిసి శివమొగ్గ తాలూకా మండఘట్ట గ్రామ శివారులో ఓ ఇంటిలో ఉంటూ గొర్రెలను, మేకల పెంపక కేంద్రంలో కూలీ పనులకు వెళ్లేవాడు. కాగా కొన్ని నెలలుగా తన కుమార్తెపై కెంప అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే హతమారుస్తానని బెదిరించడంతోపాటు ఆమెను గదిలో నిర్బంధించాడు. వీరు ఉంటున్న ఇల్లు ఊరికి దూరంగా ఒంటరిగా ఉండడంతో ఈ విషయం ఎవరికీ తెలియలేదు.
ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళితే విషయం బహిర్గతమై తనకు ముప్పు వాటిల్లుతుందని భావించిన కెంప మరింత క్రూరుడిగా మారి ఆమెపై నిర్బంధాన్ని మరింత పెంచాడు. గత శనివారం సాయంత్రం బాలికకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తానే పురుడు పోశాడు. అనంతరం రక్తపు మడుగులోనే తల్లీబిడ్డను ఉంచి తలుపులు వేసుకుని పనికి వెళ్లాడు. బుధవారం ఉదయం అటుగా కూలీ పనులకు వచ్చిన మహిళలకు బాలిక ఏడుపు వినిపించడంతో వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లీకూతుళ్ల దయనీయస్థితి చూసి చలించి వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తుల ద్వారా స్త్రీశిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలిపారు. అక్కడకు చేరుకున్న అధికారులు వెంటనే బాధితురాలిని శివమొగ్గలోని మెగ్గాన్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
ఇంట్లోనే పురుడు పోసి.. రక్తం మడుగులో వదిలేసి...
Published Thu, Jul 23 2015 8:22 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement