భద్రతా దళాలు- ఉగ్రవాదులకు హోరాహోరీ కాల్పులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాట్లు ఆగడం లేదు. తాజాగా బందీపూర్ జిల్లా హాజిన్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారు. ఈ విషయాన్ని పసిగట్టిన భారత బలగాలు వారిని నిలువరించేందుకు ప్రయత్నించింది. దీంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతమంతా భయానక పరిస్థితులు నెల కొని ఉంది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఇంకో ఒక్కరు లేదా ఇద్దరు ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నట్టు భావిస్తున్నారు. ఆ ఇంటిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.
గత కొన్ని నెలలుగా కశ్మీర్‌లో ఉగ్రవాదులు, భారత బలగాల మధ్య జరుగుతున్న కాల్పులతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జనవరి 26 న జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమవ్వగా, పుల్వామాలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. జనవరి 14న జకురాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరొక టెర్రరిస్ట్‌ను కాల్చి చంపారు. ఉగ్రవాదులు గడిచిన నెల రోజుల్లోనే భారత్‌లోకి నాలుగు సార్లు చొరబడ్డారు.