సాక్షి, న్యూఢిల్లీ : ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న హరియాణాలోని స్వచ్ఛా డేరా సౌదా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, హిందూ మతంలో కల్లోలం సృష్టించి అయినా సరే జైలు నుంచి బయట పడేందుకు వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం. దేశంలో హిందూ మతంపై దాడి జరుగుతోందని, అందులో భాగంగానే గుర్మీత్ బాబాను అక్రమంగా కేసులో ఇరికించి జైలుపాలు చేశారని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి దాడుల నుంచి రక్షించుకునేందుకు ముస్లిం మతంలోకి మారడం ఒక్కటే శరణ్యం అంటూ ముఖానికి ముసుగేసుకున్న వ్యక్తితో డేరా అధికార ప్రతినిధి సందీప్ మిశ్రా వ్యాఖ్యానించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
అవును, ముస్లిం మతం పుచ్చుకోవడమే అందరికి మంచిదని, ముస్లింలు రాళ్లు విసిరినా వారి జోలికి ఎవరూ వెళ్లరని ఆ ముసుగు వ్యక్తి ఆ వీడియోలో సమాధానం ఇచ్చారు. ‘మన మాతృ భూమిలో హిందువుగా ఉండడమే నేరం అయినప్పుడు హిందూ మతాన్ని ప్రేమించడం వల్ల కన్నీళ్లే మిగులుతాయి. మన మత విశ్వాసంపై దాడి జరుగుతున్నప్పుడు మనం మతం మారితే తప్పేందీ? నాలా ఆలోచిస్తున్న వారితో నేను ముస్లిం మతంలోకి మారుతున్నాను’ అని సందీప్ మిశ్రా వ్యాఖ్యానించారు. ‘ఒట్టి చేతుల్తో కూడా మనం బుల్లెట్లను ఎదుర్కోగలం. ముస్లిం మతంతో చేరే విషయమై మన నాయకుడు ముస్లిం నాయకులతో మాట్లాడుతున్నారు. కనీసం లక్ష మంది బాబా అనుచరులు మతం మారేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని బాబా అనుచరుడొకరు వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో ముస్లిం రాజకీయ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ, షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారిలతో సంప్రదింపులు జరుపుతున్నారని సందీప్ మిశ్రా వ్యాఖ్యానించడం కూడా ఆ వీడియోలో ఉంది. ఇదంతా ఉత్తుత్తి బెదిరింపులేనని, సంక్షోభ సమయంలో మతాన్ని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెల్సినవాడు గుర్మీత్ సింగ్ అని, ఆయన గురించి బాగా తెల్సిన విశ్వసనీయులు మీడియాతో వ్యాఖ్యానించారు. జైల్లో ఒంటరిగా గడుపుతున్న గుర్మీత్ సింగ్ ఎలాంటి ఫోన్ వినియోగించడం లేదని, ఎవరితో మాట్లాడడం లేదని జైలు అధికారులు చెప్పడం కూడా అబద్ధమేనని వారన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో, అధికార యంత్రాంగంలో, పోలీసు వ్యవస్థలో ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు కలిగిన గుర్మీత్ జైలు నుంచే తన డేరా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని వారు అంటున్నారు. తాను వాడే రెండు ఫోన్ నెంబర్లను జైలు అధికారులకు గుర్మీత్ సరెండర్ చేసినట్లు చెబుతున్నారుగానీ, అవి ఒరిజనల్ నెంబర్లేనా ? కాదా? అన్న విషయాన్ని కూడా జైలు అధికారులు ఇంతవరకు తనిఖీ చేయలేదని వారు తెలియజే స్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment