శాలువాలు అమ్మేవాడిగా వచ్చిన ఉగ్రవాది
మహారాజ్‌గంజ్(ఉత్తరప్రదేశ్): ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాది దొరికిపోయాడు. లక్నోకు చెందిన శషస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ) చేతికి అతడు శనివారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో చిక్కాడు. అతడిని నజీర్ అహ్మద్ అకా సాధిక్‌గా గుర్తించిన పోలీసులు ఓ పాకిస్థాన్ పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. బన్‌హియాల్ ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణ పొందిన నజీర్ 2002 నుంచే రంబాన్ జిల్లాలో ఉగ్రవాదులకు అనుబంధంగా ఉంటూ పలు ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడు.
2003లో పాక్‌కు వెళ్లి హిజ్బుల్‌లో చేరాడు. నవంబర్ 2003 నుంచి జనవరి 2004 వరకు ఆయుధాలను ఎలా ఉపయోగించాలనే అంశంపై ప్రత్యేక శిక్షణను పొందాడు. అలాగే, ఐసిస్‌తోపాటు పాకిస్థాన్ ఆర్మీ నుంచి కూడా అతడు శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. ఏకే-47, ఏకే-56, ఎస్‌ఎల్‌ఆర్, రాకెట్ లాంచర్, అస్సాల్ట్ రైఫిల్(జీ3, జీ2)వంటి ఆయుధాలు ఎలా ఉపయోగించాలనే అంశంపై తర్ఫీదును తీసుకున్నాడు. ప్రస్తుతం భారత్‌పై పెద్ద మొత్తంలో విధ్వంసానికి ప్రణాళిక రచించుకున్న నజీర్ అందులో భాగంగా మే 10న ఖట్మాండులో దిగాడు.
మహ్మద్ షఫీ అనే మరో ఉగ్రవాదితో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి పాకిస్థాన్ మీదుగా ఇక్కడి వచ్చాడు. భారత్ భూభాగంలోకి చొరబడేందుకు కుట్ర చేసి భారత్ ఖట్మాండు సరిహద్దుకు బస్సులో వచ్చాడు. ప్రత్యేక కార్పెట్లు, కశ్మీర్ శాలువాలు విక్రయదారుగా నేపాల్ సరిహద్దు నుంచి భారత్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నం చేసిన అతడిని ఎస్‌ఎస్‌బీ బలగాలు ప్రశ్నించగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపించలేకపోయాడు. అతడిని తనిఖీ చేయగా పాక్ పాస్ పోర్టు ఒకటి లభించింది. దీంతో అప్రమత్తమైన బలగాలు వెంటనే అదుపులోకి తీసుకున్నాయి.