ఆ రోజే బాంబు పేలుళ్లు ఎక్కువ
Published Wed, Feb 15 2017 8:39 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో కూడా జరగనన్ని బాంబు పేలుళ్లు 2016లో ఒక్క భారత్ లో సంభవించాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం. నేషనల్ బాంబ్ డేటా సెంటర్(ఎన్ బీడీసీ) ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఒక్క 2016లో భారత్ లో 406 పేలుళ్లు జరిగాయి. యుద్ధవాతావరణంలో మగ్గుతున్న ఇరాక్ 221 బాంబు పేలుళ్లతో తర్వాతి స్ధానంలో నిలిచింది. మొత్తం 406 పేలుళ్లలో 337 ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్(ఐఈడీ)లను ఉపయోగించి జరిగినవేనని చెప్పింది. మిగిలిన 69 పేలుళ్లలో గ్రెనేడ్లు తదితర పేలుడు పదార్ధాలను వాడినట్లు తెలిపింది.
భారత్‌లో బాంబు పేలుళ్ల తీరును విశ్లేషించిన ఎన్‌బీడీసీకి ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. వారంలోని ఒక రోజు(గురువారం) మాత్రమే అత్యధికంగా ఐఈడీ పేలుళ్లు జరిగినట్లు కనిపెట్టింది. 2016లో గురువారాల్లో మొత్తం 63 పేలుళ్లు సంభవించాయి. కాగా, మార్చి నెలలో అత్యధికంగా 42 పేలుళ్లు జరిగినట్లు ఎన్‌బీడీసీ చెప్పింది. జమ్మూకశ్మీర్ లో జులై తర్వాత బాంబు పేలుళ్లు 121 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2016లో పొరుగుదేశమైన పాకిస్తాన్‌లో 161 పేలుడు ఘటనలు సంభవించగా.. ఆప్ఘనిస్తాన్‌లో 132, టర్కీలో 92, థాయ్‌లాండ్‌లో 71, దక్షిణాఫ్రికాలో 63, సిరియాలో 56, ఈజిప్టులో 42, బంగ్లాదేశ్‌లో 29 పేలుళ్లు సంభవించాయి.
Advertisement
Advertisement