ఆయన.. మా మనసు గెలిచారు!!
నేపాలీ పార్లమెంటులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం లక్షలాది మంది నేపాలీల మనసు దోచుకుందని అక్కడి పత్రికలు శ్లాఘించాయి. దాదాపు 24 ఏళ్ల తర్వాత నేపాలీ పార్లమెంటులో వేరే దేశం నాయకుడు ప్రసంగించారు. నేపాలీతో మొదలుపెట్టి, తర్వాత హిందీలో కొనసాగించిన మోడీ ప్రసంగం అద్భుతంగా సాగిందని ఆ పత్రిక తెలిపింది. నేపాలీల సున్నితత్వాన్ని ఏమాత్రం దెబ్బతిననీయకుండా మోడీ ప్రసంగించారని, కేవలం సాంస్కృతిక అంశాల గురించే కాక రాజకీయాంశాలను కూడా బాగా ప్రస్తావించారని అన్నారు.
నేపాల్లో మోడీ రెండు రోజుల పర్యటన సోమవారంతో ముగుస్తుంది. బుల్లెట్ను వదిలి బ్యాలెట్ను ఎంచుకున్నందుకు అభినందనలని మోడీ నేపాలీలకు చెప్పారు. నేపాలీ మావోయిస్టులు 2006లో హింసా మార్గాన్ని వీడి రాజకీయ స్రవంతిలోకి రావడాన్ని ఆయన అలా ప్రస్తావించారు. శాంతికి మారుపేరైన బుద్ధుడు నేపాల్లోనే పుట్టాడని మోడీ ప్రస్తావించగానే అక్కడి ఎంపీలందరూ ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో పార్లమెంటును మార్మోగించారు. బుద్ధుడి పేరును మోడీ తన ప్రసంగంలో ఐదుసార్లు ప్రస్తావించారని నేపాలీ మీడియా కథనాలు తెలిపాయి.