క్యాష్‌కి ఎందుకీ కటకట వచ్చింది? | No Money In ATM | Sakshi
Sakshi News home page

ఎనీ టైమ్‌ మూత

Published Wed, Apr 18 2018 8:53 AM | Last Updated on Wed, Apr 18 2018 12:26 PM

No Money In ATM  - Sakshi

ఏటీఎం అంటే ఎనీ టైమ్‌ మనీ కాదు.. ఎనీ టైమ్‌ మూత.. అవును.. మళ్లీ కరెన్సీ సంక్షోభం కల్లోలాన్ని రేపుతోంది. ఒక్కసారిగా ఏడాదిన్నర క్రితం పెద్ద నోట్ల రద్దు నాటి పరిస్థితులు పునరావృతమయ్యాయి. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ చూసినా నో క్యాష్‌ బోర్డులు కనబడితే ఇప్పుడు కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్,గుజరాత్,ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ అవే బోర్డులు దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి  ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కొత్త నోట్లు పంపిణీలోకి వచ్చాయి. ఆర్‌బీఐ డేటా ప్రకారంపెద్ద నోట్ల రద్దు చేసిన రెండు నెలలకి , అంటే 2017 జనవరి నాటికి కేవలం 8.9 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అలాంటిది ఈ ఏడాది ఏప్రిల్‌ 6 నాటికి 18.4 లక్షల కోట్లు విలువ చేసే నోట్లు చెలామణిలోకి వచ్చాయి. మరి పుష్కలంగా కొత్త నోట్లను ముద్రించినా క్యాష్‌కి ఎందుకీ కటకట వచ్చింది?

ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ఫైనాన్సియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌  –2017 (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు చట్టరూపం దాలిస్తే  బ్యాంకుల్లో తమ సొమ్ముకు భద్రత ఉండదని ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది .బ్యాంకుల్లో జరుగుతున్న భారీ స్కామ్‌లతో ఆ వ్యవస్థపైనే నమ్మకం సడలిపోతోంది. దీంతో బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు తీసేవారే తప్ప వేసేవారి సంఖ్య తగ్గిపోతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో డిపాజిట్లు 15.3 శాతంగా ఉంటే ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది.. 2018, మార్చి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి  కేవలం 6.7 శాతం మాత్రమే డిపాజిట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో నగదు డిపాజిట్ల కంటే నగదుని విత్‌ డ్రాయల్స్‌ ఎక్కువగా ఉంటోందని ఆర్‌బీఐ అధ్యయనంలో తేలింది.

కర్ణాటక ఎన్నికలు
మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఆ రాష్ట్రంలో నగదు అవసరం అనూహ్యంగా పెరిగిపోయింది. పార్టీలకతీతంగా నాయకులందరూ ఎన్నికల ప్రచారం కోసం డబ్బుని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. తమకున్న సంబంధ బాంధవ్యాలను వినియోగించి  ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి భారీగా నోట్లకట్టలను తీసుకువస్తున్నారు.

రూ. 2 వేల నోట్ల అక్రమ నిల్వలు
కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండడంతో చాలా చోట్ల రాజకీయ నేతలు ముందుగానే జాగ్రత్త పడుతున్నట్టుగా ఉంది. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్న వివిధ పార్టీలు ఇప్పటికే భారీ సంఖ్యలో 2 వేల నోట్లను అక్రమంగా నిల్వ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 2 వేల నోట్లు చెలామణిలోకి వచ్చిన తర్వాత వాటిని తీసుకువెళుతున్నవారే తప్ప, తిరిగి డిపాజిట్‌ చేస్తున్న వారు మాత్రం కనిపించడం లేదు. మరోవైపు ఆర్‌బీఐ నుంచి కొత్తగా 2 వేల నోట్లు సరఫరా కూడా నిలిచిపోయింది. ఇది కూడా ప్రస్తుతం క్యాష్‌ కొరతకి ఒక కారణమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఏటీఎం మిషన్లలో మార్పులు
కొన్నాళ్ల క్రితం ఆర్‌బీఐ కొత్తగా మార్కెట్‌లోకి విడుదల చేసిన రూ. 200 నోట్లను ఏటీఎం మిషన్లలో ఉంచడానికి వీలుగా చాలా చోట్ల సాంకేతికపరంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు.. దేశవ్యాప్తంగా 2.2 లక్షల  ఏటీఎంలు ఉంటే వాటిల్లో సగానికి పైగా ఏటీఎంలలో రూ. 200  నోట్లు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ఏటీఎం మిషన్ల నుంచి 200 నోట్లు కూడా వచ్చేలా చేయడానికి సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్‌ చేస్తున్నట్టు  ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.

పంటలు, పండుగ సీజన్‌
కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులు కూడా ఏటీఎంలు మూతపడడానికి కారణంగా కనిపిస్తోంది. రబీ పంటలు కోతకు రావడంతో రైతులకు భారీగా నగదు చెల్లించాల్సి వస్తోంది. ఇక అసోం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో బైశాఖి, బిహు వంటి పంటల పండుగల జరుపుకుంటున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలో నగదుని డ్రా చేయడంతో క్యాష్‌కి కటకట ఏర్పడింది.

అయిదు రెట్లు ఎక్కువగా రూ.500 నోట్ల ముద్రణ
దేశంలో కరెన్సీ కొరత తాత్కాలికమేనని, తర్వలోనే దీనిని పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ హామీ ఇచ్చారు. కావల్సినంత నగదు బ్యాంకుల్లో ఉందని అకస్మాత్తుగా వినియోగం పెరగడంతో ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆయన ట్వీట్‌ చేశారు. మరోవైపు నోట్ల ముద్రణను అయిదు రెట్లు పెంచుతున్నామంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ తెలిపారు. రూ. 500  నోట్లను రోజుకి 500 కోట్లు ముద్రిస్తున్నామని ఆయన చెప్పారు. మరికొద్దిరోజుల్లో రోజుకి  2,500 కోట్ల విలువ చేసే అయిదువందల నోట్లను చెలామణిలోకి తెస్తామని వెల్లడించారు. మరో నెలరోజుల్లో 75 వేల కోట్ల విలువ చేసే 500 నోట్లు అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా కరెన్సీ కష్టాలను తొలగిస్తామని వివరించారు.
(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement