![Old Woman Taken To Hospital On Cot In UP - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/15/Woman-Taken-To-Hospital-On-_0.jpg.webp?itok=lqq96UJI)
లక్నో : విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వ సిబ్బంది తీరులో మార్పు రావటం లేదు. మనిషి ఆపదలో ఉంటే స్పందించాల్సింది పోయి.. కుంటి సాకులు చెబుతూ కొందరు తమ చేతులు దులుపుకుంటున్నారు. అంబులెన్స్‌లు నిరాకరించటం.. పెషెంట్లను తోపుడు బండ్ల మీద, భుజాల మీద మోసుకెళ్లిన ఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా యూపీలో అలాంటి సన్నివేశం ఒకటి తారసపడింది. ఓ వృద్ధురాలి ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు ఆమెని మంచంపైనే ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. షాజహాన్పూర్ జిల్లా బేద్‌పూర్ గ్రామానికి చెందిన 70ఏళ్ల మన్‌జిత్ కౌర్‌కు శనివారం ఆరోగ్యం విషమించడంతో ఆమె బంధువులు 108కి ఫోన్ చేశారు. వాహనంలో డీజిల్ లేనందున రావడం కుదరదని అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు. దీంతో బంధువులు ఆమెని మంచంపై పడుకొబెట్టి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అలా చాలా కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఓ ట్రక్ సాయంతో ఆమెని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వలేదు, దీంతో మంచంపైనే ఆమెని అత్యవసర విభాగానికి తీసుకెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై రోగి బంధువులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment