మోదీ, మమత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం
కోల్కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్లోని ర్యాలీలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. మోదీ, మమతలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా తయారయ్యారని మండిపడ్డారు. ఇద్దరి పాలనా విధానం ఒకటేనని ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ అవినీతి, నియంతృత్వ పాలన కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పాలన కొనసాగిస్తున్నారని సోనియా వ్యాఖ్యానించారు. ఇక ప్రధాని మోదీ సెక్యులరిజం, ప్రజాస్వామ్యాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రమాదకర పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.
ఐదేళ్ల క్రితం తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన మమత ఇప్పడు ఓట్ల కోసం ప్రజలను భయపెడుతున్నారని అన్నారు. రెండేళ్ల క్రితం అనేక హామీలిచ్చి అధికారంలోకి మోదీ అధికారంలోకి వచ్చారని, వీరిద్దరూ గత ప్రభుత్వాలను నిందించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏమీ చేయలేదని రెండేళ్ల పాలనలో మోదీనే అంతా చేశానని చెప్పుకుంటున్నారని సోనియా ఎద్దవా చేశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి స్థానిక సంస్థలను ఏర్పాటు చేసిందని, సెక్యులరిజాన్ని కాపాడుతూ పాలన కొనసాగించిందని గుర్తుచేశారు. తృణమూల్ కాంగ్రెస్ కుళ్లిన చేప అని అది బెంగాల్ మొత్తాన్ని నాశనం చేస్తోందని సోనియా పేర్కొన్నారు.
ఐదేళ్ల క్రితం మార్పు (పరివర్తన్) తెస్తానని అన్నప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ మారిపోయారని ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని అన్నారు. ఇప్పటికీ మార్పు ఎందుకు రాలేదు, ఇంత వరకు యువతకు ఎందుకు ఉద్యోగాలు రాలేదో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించిరు.