రాహుల్ అధ్యక్షుడైతే బీజేపీకి అచ్ఛే దిన్: స్మృతి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతుండగా, కొంత కాలం ఆగాలని కొందరు సూచిస్తున్నారు. కూతురు ప్రియాంకకే బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి విన్నవిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా చేయడం తమకు బాగా అనుకూలిస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ కు పగ్గాలు అప్పగిస్తే.. బీజేపీకి అచ్ఛే దిన్ అంటూ ఎద్దేవా చేశారు.
అప్పుడు రాహుల్ ఎక్కడ..?
రెండేళ్లలో మంత్రిగా ఏం చేశారన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. స్కూలు వ్యవస్థపై ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్నాం, పిల్లల వివరాలు సేకరించడం ప్రారంభించామన్నారు. ఆ వివరాలు లేని కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదని పేర్కొన్నారు. ఢిల్లీలోని జేఎన్యూ వివాదం రాజకీయ రంగు పులుముకోవడంపై ఆమె స్పందించారు. గతంలో కూడా ఆ వర్సిటీలో వివాదాలున్నాయి. యూపీఏ హయాంలో వర్సిటీలో ఎన్నో జరిగినా ఆ సమయంలో అక్కడ కనిపించని రాహుల్, ఇప్పుడు మాత్రం వర్సిటీకి వచ్చి విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ రాజకీయం చేస్తున్నారని స్మృతీ ఇరానీ విమర్శించారు.